ఇంగ్లండ్‌ పని పట్టిన కుల్దీప్‌

12 Jul, 2018 20:50 IST|Sakshi

ఆరు వికెట్లతో అదరగొట్టిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌

టీమిండియా విజయ లక్ష్యం 269

నాటింగ్‌హామ్‌: టీమిండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌ యాదవ్‌ మరో సారి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాడు. కెరీర్‌లోనే బెస్ట్‌ గణాంకాలు కుల్దీప్‌(6/25) నమోదు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇంకో బంతి మిగిలిండగానే 268 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న రాయ్‌-బెయిర్‌ స్టో జోడిని విడదీసి కుల్దీప్‌ వికెట్ల ఖాతా తెరిచాడు. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ 38(35 బంతుల్లో 6ఫోర్లు), బెయిర్‌ స్టో 38(35 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రూట్‌(3)ను వరుస ఓవర్లలో కుల్దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను కెప్టెన్‌ మోర్గాన్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ చహల్‌ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి మోర్గాన్‌(19) వెనుదిరిగాడు.

ఆదుకున్న స్టోక్స్‌- బట్లర్‌
105 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, ఐపీఎల్‌ హీరో బట్లర్‌ ఆదుకున్నారు. ఆరంభం నుంచి  స్టోక్స్‌ నెమ్మదిగా ఆడగా.. బట్లర్‌ ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఐదో వికెట్‌కు ఈ జోడి 93 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను పటిష్టస్థితికి చేర్చారు. 

మరోసారి కుల్దీప్‌..
ఇంగ్లండ్‌ను లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ మరోసారి దెబ్బతీశాడు.  క్రీజులో పాతుకపోయిన స్టోక్స్ 50(103 బంతుల్లో 2ఫోర్లు,1 సిక్సర్‌), బట్లర్‌ 53(51 బంతుల్లో 5ఫోర్లు)లను కుల్దీప్‌ ఔబ్‌ చేశాడు. చివర్లో మొయిన్‌ ఆలీ 24(23 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్సర్‌), అదిల్‌ రషీద్‌ 22(16 బంతుల్లో 1ఫోర్‌, 1 సిక్సర్‌) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వరుస ఓవర్లలో టీమిండియా బౌలర్లు   వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 268 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ ఆరు వికెట్లతో చెలరేగగా, ఉమేశ్‌ రెండు వికెట్లు, చహల్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సిద్దార్థ్‌ కౌల్‌ ధారళంగా పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు.  
 

మరిన్ని వార్తలు