స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

27 Jul, 2019 17:42 IST|Sakshi

లండన్‌:  అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చని జోఫ్రా ఆర్చర్‌ మరోసారి నిరూపించాడు. జోఫ్రా ఆర్చర్‌ ప్రతిభ ఇంగ్లండ్‌కు అవసరమున్ననేపథ్యంలో నిబంధనలను సవరించి మరీ జట్టులోకి చోటు కల్పించారు. ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టులో అవకాశం కల్పించిన ఇంగ్లండ్‌ సెలక్టర్లు.. తాజాగా యాషెస్‌ సిరీస్‌ కోసం కూడా ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు కోసం ఇంగ్లండ్‌ జట్టును సెల​క్టర్లు ప్రకటించారు. జోయ్‌ రూట్‌ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించిన సెలక్టర్లు.. అనూహ్యంగా ప్రపంచకప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌కు తిరిగి వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలను అప్పగించింది. 

ఐర్లాండ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన జేసన్‌ రాయ్‌ను యాషెస్‌ సిరీస్‌కూ ఎంపిక చేశారు. గత మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చిన జోస్‌ బట్లర్‌, అండర్సన్‌, బెన్‌ స్టోక్స్‌లు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా టీ20ల్లో, తాజా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్‌ ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అండర్సన్‌, బ్రాడ్‌లకు తోడు క్రిస్‌ వోక్స్‌ తోడవడంతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ మరింత బలోపేతమైంది. ఇక తొలిసారి ప్రపంచకప్‌ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్‌ అదే ఉత్సాహంలో యాషెస్‌ సాధించేయాలని తెగ ఆరాటపడుతోంది. 

తొలిటెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:
జోయ్‌ రూట్‌(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జిమ్మీ అండర్సన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, బట్లర్‌, స్యామ్‌ కరన్‌, జోయ్‌ డెన్లీ, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, ఓల్లీ స్టోన్‌, క్రిస్‌ వోక్స్‌  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు