-

ఇంగ్లండ్ లక్ష్యం 561

24 Nov, 2013 01:09 IST|Sakshi
ఇంగ్లండ్ లక్ష్యం 561

 బ్రిస్బేన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు 561 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (154 బంతుల్లో 124; 13 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ మైకేల్ క్లార్క్ (130 బంతుల్లో 113; 9 ఫోర్లు; 1 సిక్స్) శతకాలతో హోరెత్తించడంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 7 వికెట్లకు 401 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
 
 
 వార్నర్‌కు ఇది తొలి యాషెస్ టెస్టు సెంచరీ కాగా ఓవరాల్‌గా మూడోది. అటు క్లార్క్ కెరీర్‌లో 25వ శతకాన్ని అందుకున్నాడు. వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు), మిచెల్ జాన్సన్ (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) మరోసారి రాణించారు. దీంతో ఇంగ్లండ్‌పై 560 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయ్యింది. ట్రెమ్లెట్‌కు మూడు, బ్రాడ్, స్వాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 561 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 24/2 స్కోరుతో ఉంది.
 
 క్రీజులో కెప్టెన్ కుక్ (50 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్), పీటర్సన్ (3 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి మ్యాచ్‌ను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పర్యాటక జట్టు అసాధారణ ఆటతీరును కనబరిస్తే మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించినట్టవుతుంది. ఇప్పటిదాకా 2003లో ఆసీస్‌పైనే 418 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఛేదించి విజయం సాధించింది.
 
 సంక్షిప్త స్కోర్లు
 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 295; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 136; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 401/7 డిక్లేర్డ్ (94 ఓవర్లలో) (వార్నర్ 124, క్లార్క్ 113, హాడిన్ 53, బెయిలీ 34, మిచెల్ జాన్సన్ 39 నాటౌట్, ట్రెమ్లెట్ 3/69, బ్రాడ్ 2/55) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 24/2 (కుక్ 11 బ్యాటింగ్, పీటర్సన్ 3 బ్యాటింగ్).
 

మరిన్ని వార్తలు