లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

27 Jul, 2019 16:52 IST|Sakshi

లండన్‌: తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన పిచ్‌పై ఇంగ్లండ్‌ సారథి జోయ్‌ రూట్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. అయితే టెస్టు మ్యాచ్‌కు కావాల్సిన విధంగా పిచ్‌ను రూపొందించలేదని పిచ్‌ క్యురేటర్‌పై రూట్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘లార్డ్స్‌ పిచ్‌ టెస్టు మ్యాచ్‌కు ప్రామాణికంగా తయారు చేయలేదు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌, బౌలింగ్‌కు అంత అనుకూలంగా లేదు. మ్యాచ్‌ మధ్యలో పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మ్యాచ్‌ గెలిచాము. కానీ అసంతృప్తిగానే ఉన్నాం. మరోసారి టెస్టులకు ఇలాంటి పిచ్‌లు రూపొందించవద్దు. టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్‌లు మంచివి కావు’అంటూ రూట్‌ వివరించాడు.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 143 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 182 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు పేసర్లు క్రిస్‌ వోక్స్, స్టువర్ట్‌ బ్రాడ్‌ ధాటికి నిలవలేక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 38 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి పది మంది ఐర్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వగా.. జేమ్స్‌ మెకల్లమ్‌ 11 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి 92 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తన బ్యాటింగ్‌ ప్రదర్శనకు ‘మ్యాన్‌  ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం.

మరిన్ని వార్తలు