350 పరుగులూ ఛేదించారు!

19 Jun, 2015 01:44 IST|Sakshi
350 పరుగులూ ఛేదించారు!

  ఇంగ్లండ్ మరో సంచలన విజయం
  వన్డేల్లో నాలుగో అత్యుత్తమ లక్ష్యఛేదన
  సెంచరీలతో చెలరేగిన మోర్గాన్, రూట్
 
 నాటింగ్‌హామ్: ప్రపంచ క్రికెట్ మొత్తం మారినా... సంప్రదాయ టెస్టు క్రికెట్ నీడలోనే ఉంటూ వన్డేలను పట్టించుకోని ఇంగ్లండ్ ఇప్పుడు మారినట్లుంది! వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు సొంతగడ్డపై చెలరేగి ఆడుతోంది. గతంలో తమకు అలవాటు లేని శైలిలో దూకుడును ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఇంగ్లండ్ పేరిట ఎన్నడూ కనిపించని రికార్డు గణాంకాలు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో ఇది మళ్లీ కనిపించింది. 350 పరుగుల విజయలక్ష్యం...అయినా ఏ మాత్రం తడబాటు లేకుండా ఆ జట్టు అలవోకగా దీనిని అధిగమించింది. అదీ 7 వికెట్ల తేడాతో, మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించడం మరో విశేషం.
 
  కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (82 బంతుల్లో 113; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) జో రూట్ (97 బంతుల్లో 106 నాటౌట్; 13 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వీరికి అలెక్స్ హేల్స్ (38 బంతుల్లో 67; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జాసన్ రాయ్ (35 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అంతకు ముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 349 పరుగులు చేసింది.  తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. చివరిదైన ఐదో వన్డే శనివారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది.
 
 4- వన్డే చరిత్రలో ఇది నాలుగో అత్యుత్తమ ఛేదన. ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమం.
 1- ఇంగ్లండ్ తొలి సారిగా వరుసగా నాలుగు వన్డేలలో 300కు పైగా పరుగులు చేసింది.
 

>
మరిన్ని వార్తలు