సమమా... సంచలనమా!

16 Jul, 2020 01:02 IST|Sakshi
హోల్డర్‌ బృందం...రూట్‌

సిరీస్‌ విజయమే లక్ష్యంగా విండీస్‌

పరువు నిలబెట్టుకునేందుకు ఇంగ్లండ్‌

నేటి నుంచి రెండో టెస్టు

రూట్‌ పునరాగమనం

ఇంగ్లండ్‌ గడ్డపై వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ గెలిచి 32 ఏళ్లయింది. జట్టులో దిగ్గజాలు ఉన్న కాలంలో 1988లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ముందు బంగారు అవకాశం నిలిచింది. తొలి టెస్టు విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో గెలుపు అందుకుంటే ఈ సిరీస్‌ చిరస్మరణీయంగా మారిపోతుంది. అయితే అనూహ్యంగా గత మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మళ్లీ కోలుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు ముందు వరుసగా నాలుగు సిరీస్‌లలో తొలి టెస్టులో ఓడి కూడా ముందంజ వేసిన ఇంగ్లండ్‌ దానినే పునరావృతం చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. 

మాంచెస్టర్‌: ఇంగ్లండ్, వెస్టిండీస్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు అంతా కరోనాకు సంబంధించిన హంగామాయే. మ్యాచ్‌ ఫలితంకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్‌ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ మైదానం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన విండీస్‌ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది.  

డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్‌లకు విశ్రాంతి
సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ తుది జట్టును మ్యాచ్‌ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత  కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ జో రూట్‌ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్‌ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు

అండర్సన్, మార్క్‌ వుడ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్‌ బ్రాడ్, ఒలీ రాబిన్సన్‌లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్‌ బ్రాడ్‌ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్‌ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్‌ రాకతో లైనప్‌ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్‌ బట్లర్‌ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్‌ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అదే విధంగా అండర్సన్‌ నుంచి కూడా జట్టు మరింత మంచి ప్రదర్శనను ఆశిస్తోంది.  

మార్పుల్లేకుండానే...  
తొలి టెస్టు విజయంలో విండీస్‌ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్‌కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్‌ బౌలర్ల మంత్రం గత మ్యాచ్‌లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్‌ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్‌ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్‌ ఛేజ్‌ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ శుభారంభం అందిస్తే విండీస్‌ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్‌వుడ్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్‌ కాకపోయినా జట్టుగా విండీస్‌ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు.  

ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ గెలిచాయి. 4 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లండ్‌పై విండీస్‌ చివరిసారి 1988లో టెస్టు గెలిచింది. ఇంగ్లండ్‌ మాత్రం విండీస్‌తో ఇక్కడ జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచి, మరో దానిని ‘డ్రా’ చేసుకుంది.   
 

మరిన్ని వార్తలు