చెలరేగాలని ఇంగ్లండ్‌.. అడ్డుకోవాలని బంగ్లా

8 Jun, 2019 05:30 IST|Sakshi

ప్రపంచ కప్‌లో నేడు రెండు జట్ల మధ్య మ్యాచ్‌

మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కార్డిఫ్‌: గత రెండు ప్రపంచ కప్‌లలో తమను ఓటమి పాల్జేసిన బంగ్లాదేశ్‌ను ఆతిథ్య ఇంగ్లండ్‌ శనివారం ‘ఢీ’కొంటుంది. రెండింటి మధ్య ఈ నాలుగేళ్లలో నాలుగే వన్డేలు జరిగినా విడివిడిగా చూస్తే మాత్రం పటిష్టంగా మారాయి. ఇంగ్లండ్‌ భీకరంగా పురోగతి సాధించగా... బంగ్లా అన్ని పెద్ద జట్లకూ దీటుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత టోర్నీలో ఎదురే ఉండదనుకున్న ఆతిథ్య జట్టును పాకిస్తాన్‌ తేలిగ్గానే మట్టికరిపించి పరోక్షంగా ప్రత్యర్థులకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. బంగ్లా కూడా దక్షిణాఫ్రికాను ఓడించిన ఊపులో ఉంది. కార్డిఫ్‌ మైదానంలో న్యూజిలాండ్‌–శ్రీలంక, శ్రీలంక–అఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ల్లో పిచ్‌ పేసర్లకు సహకరించింది.

ఈ వికెట్‌ కొంత నెమ్మదిగానూ ఉంటుంది. అయితే, బౌండరీ పరిధి (ప్రత్యేకించి స్ట్రయిట్‌ బౌండరీ) చిన్నది కావడంతో భారీ స్కోర్లకు అవకాశం లేకపోలేదు. నిరుడు ఈ వేదికలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 342 పరుగులు చేసింది. రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ముఖాముఖిగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 వన్డేలు జరగ్గా 16 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. నాలుగింటిలో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో మాత్రం బంగ్లాదే పైచేయి కావడం విశేషం. కప్‌లో మూడు మ్యాచ్‌లాడగా... రెండింటి (2011, 15)లో బంగ్లాదేశ్, ఒకదాంట్లో (2007) ఇంగ్లండ్‌ నెగ్గాయి.

మరిన్ని వార్తలు