ఎవరు గెలిచినా 'డబుల్'

1 Apr, 2016 12:40 IST|Sakshi
ఎవరు గెలిచినా 'డబుల్'

కోల్ కతా: టీ20 ప్రపంచకప్ తుది సమరంలో తలపడేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఈ రెండు జట్లు టైటిల్ పోరు సాగించనున్నాయి. ఈసారి గ్రూప్-1లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్ కు చేరడం విశేషం. ఈ రెండు టీముల్లో ఏది గెలిచినా రెండోసారి వరల్డ్ కప్ అందుకున్న జట్టు అవుతుంది. 2010లో ఇంగ్లండ్, 2012లో విండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.

తాజా ప్రపంచకప్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లీషు జట్టు అనూహ్యంగా ఆడి ఫైనల్ కు చేరింది. ఓటమితో టోర్ని ఆరంభించిన ఇంగ్లండ్ తర్వాత పుంజుకుని టైటిల్ వేటకు సిద్ధమైంది. మార్చి 16న వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ లను ఓడించి ఫైనల్ చేరుకుంది.

లీగ్ దశలో వరుసగా మూడు అగ్రశ్రేణి జట్లను ఓడించిన విండీస్ చివరి లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా అప్ఘానిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే సెమీస్ నంబర్ వన్ టీమిండియాను ఓడించిన టైటిల్ బరిలో నిలిచింది. ఇంగ్లండ్, విండీస్ లో ఏ జట్టు రెండోసారి టీ20 వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంటుందో చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు