ఈ సారి ఇంగ్లండ్‌దే ‘సూపర్‌’

11 Nov, 2019 04:35 IST|Sakshi

చివరి టి20లో విజయం

సూపర్‌ ఓవర్‌లో ఓడిన న్యూజిలాండ్‌

ఆక్లాండ్‌: సుమారు నాలుగు నెలల క్రితం ఇంగ్లండ్‌–న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుందిగా! సూపర్‌ ఓవర్‌లో కూడా ఇరు జట్లు సమంగా నిలవడంతో బౌండరీల లెక్కతో ఫలితం తేలింది. ఇప్పుడు ఇరు జట్లు తలపడిన మరో మ్యాచ్‌ దాదాపు అదే తరహాలో నాటకీయంగా సాగింది. ఫార్మాట్‌ టి20కి మారగా... ఈ సారి మాత్రం ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఇంగ్లండ్‌ స్పష్టమైన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్‌ ‘సూపర్‌ ఓవర్‌’లో 9 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది.

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ముందుగా న్యూజిలాండ్‌ 5 వికెట్లకు 146 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ కూడా 11 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 146 పరుగులే చేసింది. కివీస్‌ తరఫున మారి్టన్‌ గప్టిల్‌ (20 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మున్రో (21 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 84 పరుగులు జోడించగా, సీఫెర్ట్‌ (16 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్సర్లు) కూడా అదే తరహాలో దూకుడు ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌ జట్టు నుంచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (18 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ సహకరించారు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో ముందుగా ఇంగ్లండ్‌ 17 పరుగులు చేయగా, కివీస్‌ 8 పరుగులకే పరిమితమైంది.  

పరుగుల వరద...
11 ఓవర్ల ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు కూడా చెలరేగిపోయాయి. ఓవర్‌కు 13.27 రన్‌రేట్‌తో పరుగులు సాధించాయి. కివీస్‌ తమ 3 ఓవర్ల పవర్‌ప్లేలో 17, 20, 18 చొప్పున మొత్తం 55 పరుగులు చేసింది. తర్వాతి 8 ఓవర్లలో ఆ జట్టు వరుసగా 15, 13, 5, 7, 15, 10, 16, 10 పరుగులు చేసింది. జట్టు ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌ జట్టు పవర్‌ప్లేలో 9, 13, 17 చొప్పున మొత్తం 39 పరుగులు సాధించింది. తర్వాతి 7 ఓవర్లలో మోర్గాన్‌ సేన వరుసగా 9, 20, 22, 10, 11, 10, 10 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. నీషమ్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి 3 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. అయితే తర్వాతి మూడు బంతులను జోర్డాన్‌ 6, 2, 4 బాది స్కోరు సమం చేశాడు. దాంతో ఫలితం సూపర్‌ ఓవర్‌కు చేరింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు