తొలి టెస్టు ఇంగ్లండ్‌దే

26 May, 2015 04:05 IST|Sakshi
తొలి టెస్టు ఇంగ్లండ్‌దే

బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షో
 లార్డ్స్: ‘డ్రా’ ఫలితం ఖాయమనుకున్న లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చివరిరోజు బంతితో అద్భుతం చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బెన్ స్టోక్స్ (3/38)తో పాటు బ్రాడ్ (3/50)కూడా  బంతితో పవర్ చూపడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 124 పరుగుల తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ చివరిరోజు 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. కోరె అండర్సన్ (87 బంతుల్లో 67; 13 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (143 బంతుల్లో 59; 9 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోగలిగారు.

సున్నా పరుగులకే రెండు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత స్టోక్స్ వరుస బంతుల్లో విలియమ్సన్, మెకల్లమ్ వికెట్లను తీసి చావుదెబ్బ కొట్టాడు. 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కివీస్‌ను అండర్సన్, వాట్లింగ్ జోడి ఆరో వికెట్‌కు 107 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ అవుటవ్వడంతో కివీస్ ఓటమి ఖాయమైంది. అండర్సన్, అలీ, రూట్, వుడ్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. కుక్ (162; 17 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు తొమ్మిది పరుగులు మాత్రమే జత చేశాడు. బౌల్ట్‌కు ఐదు వికెట్లు, సౌతీ, హెన్రీలకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండో టెస్టు ఈనెల 29న లీడ్స్‌లో మొదలవుతుంది.
 

>
మరిన్ని వార్తలు