కోహ్లి బ్యాట్‌తో 15 ఫోర్లు.. 5 సిక్సులు.!

25 Mar, 2018 13:20 IST|Sakshi
కోహ్లితో డానియెల్లి యాట్‌, డానియెల్లికి కోహ్లి బహుమతిచ్చిన బ్యాట్‌ (ఇన్‌సెట్‌లో)

సెంచరీతో కదం తొక్కిన  డానియెల్లి యాట్‌

భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్‌

మంధాన, మిథాలీల అర్ధ శతకాలు వృధా

కొనసాగుతున్న టీమిండియా పరాజయాలు

సాక్షి, ముంబై : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు మరో ఓటమి చవిచూసింది.  స్మృతి మంధాన, మిథాలీలు హాఫ్‌ సెంచరీలతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా పర్యాటక మహిళా జట్టు సునాయసంగా విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డానియెల్లి యాట్‌ 124 (64 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో భారత మహిళల లక్ష్యం చిన్నబోయింది.   డానియెల్లికి అండగా టామీ బీయుమెంట్‌ 35(23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సు) నిలిచింది. చివర్లో  టామీ అవుటైనా హెథర్‌ (8) టార్గెట్‌ను పూర్తి చేసింది. దీంతో ఇంగ్లండ్‌ 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకోంది.  టీ20ల్లో ఇది అత్యధిక పరుగుల ఛేదనగా రికార్డుకెక్కగా.. 52 బంతుల్లోనే డానియెల్లి  రెండో వేగవంతమైన శతకం నమోదు చేసింది.

ఇక భారత మహిళలకు ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న టీమిండియా.. అంతకు ముందు  ఆస్ట్రేలియాతో​ మూడు వన్డే సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ అయింది. ఈ పరాజయంతో భారత్‌ ఈ ట్రైసిరీస్‌ ఫైనల్‌ చేరడం కష్టంగా మారనుంది. 

డానియెల్లి యాట్‌ ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ బ్యాట్‌తోనే కోహ్లిలా  డానియెల్లి  15 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం చూపించింది.

భారత్‌  స్కోర్‌ 198/4 (20 ఓవర్లలో)
ఇంగ్లండ్‌ స్కోర్‌ 199/3( 18.4 ఓవర్లలో)

మరిన్ని వార్తలు