ఇంగ్లండ్‌ ఘన విజయం

28 Jan, 2020 04:47 IST|Sakshi

3–1తో టెస్టు సిరీస్‌ సొంతం

191 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు

జొహన్నెస్‌బర్గ్‌: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుకు మరో పరాభవం. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నెగ్గి కోలుకున్నట్లు కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో సిరీస్‌ను చేజార్చుకుంది. సోమవారం నాలుగో రోజే ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్‌ 191 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. 466 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది.

వాన్‌ డర్‌ డసెన్‌ (98; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... డి కాక్‌ (39), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (35) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్క్‌ వుడ్‌ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 318 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టిన బెన్‌ స్టోక్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 2004–05 తర్వాత సఫారీలు వరుసగా 3 టెస్టు సిరీస్‌లు కోల్పోవడం ఇదే మొదటిసారి. స్వదేశంలో శ్రీలంక చేతిలో 0–2తో పరాజయంపాలైన ఆ జట్టు తర్వాత భారత గడ్డపై కూడా 0–3తో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా పేసర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిలాండర్‌ 64 టెస్టుల్లో 224 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కెప్టెన్‌ డు ప్లెసిస్‌కు సారథిగా, ఆటగాడిగా కూడా ఇదే చివరి టెస్టు కావచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు