ఇంగ్లండ్‌దే మూడో టెస్టు

21 Jan, 2020 04:52 IST|Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్‌ ఆడిన దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్‌ చేయడం ద్వారా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 102/6తో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 26.5 ఓవర్ల పాటు ఆడి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది.

కేశవ్‌ మహరాజ్‌ (71; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), 11వ నంబర్‌ ఆటగాడు ప్యాటర్సన్‌ (39; 6 ఫోర్లు) పదో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. రూట్‌ వేసిన 82వ ఓవర్లో కేశవ్‌ మహరాజ్‌ 4,4,4,6,6 బాదడంతో మొత్తం 28 పరుగులు (4 బైస్‌) వచ్చాయి. తద్వారా టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 28 పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా రూట్‌ గుర్తింపు పొందాడు. గతంలో పీటర్సన్‌ (దక్షిణాఫ్రికా), అండర్సన్‌ (ఇంగ్లండ్‌) కూడా 28 పరుగులు చొప్పున ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు