కెప్టెన్‌ గెలిపించాడు

20 Jun, 2018 01:06 IST|Sakshi

రెండు గోల్స్‌ చేసిన హ్యారీ కేన్‌

ట్యునీషియాపై 2–1తో  ఇంగ్లండ్‌ విజయం  

ప్రపంచ కప్‌లో మరో చిన్న జట్టు నుంచి స్ఫూర్తిదాయక పోరాటం. ఇంగ్లండ్‌ స్ట్రయికర్ల దాడులు... ట్యునీషియా రక్షణ శ్రేణి నిలువరింతల మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. మొదట్లోనే గోల్‌ సమర్పించుకున్నా... తర్వాత ట్యునీషియా పట్టుగానే ఆడింది. మాజీ చాంపియన్‌ను నిలువరించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేస్తుందేమో  అనిపించింది. ఇంజ్యూరీ సమయంలో కెప్టెన్‌ హ్యారీ కేన్‌ చేసిన హెడర్‌ గోల్‌తో గెలిచిన ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది.   

వోల్గోగ్రాడ్‌: ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా అనుభవాన్ని రంగరించిన ఇంగ్లండ్‌... ఆఖర్లో ఫలితాన్ని తనవైపు తిప్పుకొంది. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌లో ఆ జట్టు 2–1 తేడాతో ట్యునీషియాను ఓడించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌  హ్యారీ కేన్‌ రెండు (11వ ని., 91వ ని.) గోల్స్‌ చేయగా... ట్యునీషియా తరఫున ఫెర్జానీ ససీ 35వ నిమిషంలో ఒక గోల్‌ కొట్టాడు. 

అటు దూకుడు... ఇటు నిలువరింత 
జెస్సీ లిన్‌గార్డ్‌ మూడో నిమిషంలోనే దాదాపు గోల్‌ చేసినంత పని చేయడంతో మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ దూకుడుగా ప్రారంభించింది. అయితే, అతడి షాట్‌ను కీపర్‌ మోయిజ్‌ హాసెన్‌ అడ్డుకున్నాడు. ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్‌కు కొద్దిసేపటికే ఫలితం ద క్కింది. 11వ నిమిషంలో జాన్‌ స్టోన్స్‌ కొట్టిన హెడర్‌ గోల్‌ పోస్ట్‌ సమీపం నుంచి వెళ్తుండగా... అందుకున్న హ్యారీ కేన్‌ ఒడుపుగా స్కోరు చేశాడు. మరోవైపు ట్యు నీషియా అటాకింగ్‌కు దిగడంలో ఆలస్యం చేసింది. వరుసగా రెండు కార్నర్‌ కిక్‌లు వచ్చినా వినియోగించుకోలేకపోయింది. కానీ, వాకర్‌... బెన్‌ యూసఫ్‌ను అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో ఆ జట్టుకు అనుకోని వరంలా పెనాల్టీ లభించింది. దీనిని ససీ వేగవంతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. అప్రమత్తమైన ఇంగ్లండ్‌... ఇద్దరు స్ట్రయికర్లను మోహరించి అవకాశాలు సృష్టించుకుంది. ఇవేవీ లాభించకపోవడంతో మొదటి భాగం 1–1తో ముగిసింది. 

రెండో భాగం పోటాపోటీ... 
ఇరు జట్లు ప్రభావవంతంగా ఆడకపోవడంతో రెండో భాగం మొదటి పది నిమిషాలు సాధారణంగా సాగింది. తర్వాత బంతిని ఆధీనంలో ఉంచుకుంటూ ఇంగ్లండ్‌ ఫార్వర్డ్‌లు జోరు కనబర్చినా ట్యునీషియా రక్షణ శ్రేణి అడ్డుకుంటూ వారి సహనాన్ని పరీక్షించింది. దీంతో ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌ ఏకంగా నలుగురు ఆటగాళ్లతో దాడులకు దిగింది. అయినా నిర్ణీత సమయంలో మరో గోల్‌ నమోదు కాలేదు. మ్యాచ్‌ ‘డ్రా’ వైపు మళ్లుతున్నట్లు కనిపించింది. కానీ ఇంజ్యూరీ సమయం ప్రారంభం (90+1)లోనే డిఫెండర్‌ మగ్యురే నుంచి అందిన బంతిని హ్యారీ కేన్‌ తలతో గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మిగిలిన స్వల్ప వ్యవధిలో ట్యునీషియా స్కోరు సమం చేయలేకపోయింది. మ్యాచ్‌లో 59 శాతం బంతిని అదుపులో ఉంచుకున్న ఇంగ్లండ్‌... 17 సార్లు దాడులకు దిగింది.    

మరిన్ని వార్తలు