ఇంగ్లండ్‌దే తొలి వన్డే

21 Sep, 2017 00:25 IST|Sakshi
ఇంగ్లండ్‌దే తొలి వన్డే

మాంచెస్టర్‌: వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన జానీ బెయిర్‌స్టో (97 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు) ఇంగ్లండ్‌ను గెలిపించాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్‌ 42 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... గేల్‌ (37), షై హోప్‌ (35) ఫర్వాలేదనిపించారు. స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది.

జో రూట్‌ (54) అర్ధ సెంచరీతో రాణించాడు. బెయిర్‌స్టో, రూట్‌ రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు.  మరోవైపు వెస్టిండీస్‌ ఓటమి శ్రీలంక జట్టుకు కలిసి వచ్చింది. 2019 ప్రపంచకప్‌నకు శ్రీలంక నేరుగా అర్హత పొందింది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే లంకను వెనక్కినెట్టి విండీస్‌ ప్రపంచకప్‌కు వెళ్లేది.

మరిన్ని వార్తలు