వన్డేలో ఒక్కడే 350 పరుగులు

21 Apr, 2015 00:33 IST|Sakshi
వన్డేలో ఒక్కడే 350 పరుగులు

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో రికార్డు
 
లండన్: వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధారణమై పోయిన రోజుల్లో ఇక ట్రిపుల్ సెంచరీలు కూడా అసాధ్యం కాదని నిరూపించాడు ఇంగ్లండ్‌లోని యువ క్రికెటర్. 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు... ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో లాంకషైర్‌కు చెందిన 20 ఏళ్ల క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఈ ఘనత సాధించాడు. క్లాడీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాన్‌ట్‌విచ్ జట్టు తరఫున ఆడుతూ లివింగ్‌స్టోన్ పరుగుల వరద పారించాడు. ‘గతంలో భారత్‌లోని హైదరాబాద్‌లో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో నిఖిలేశ్ అనే కుర్రాడు 334 పరుగులు చేశాడు.

ఇన్నాళ్లూ వన్డేల్లో ఇదే రికార్డు. దీనిని లివింగ్‌స్టోన్ అధిగమించాడు’ అని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కెనడాలోని ఒటాగోలో 2014లో ఈగెన్ అనే క్రికెటర్ 358 పరుగులు సాధించాడట. అత్యధిక పరుగుల రికార్డు సంగతి ఎలా ఉన్నా లివింగ్‌స్టోన్ 350 పరుగుల సాయంతో నాన్‌ట్‌విచ్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లకు 579 పరుగులు చేసింది. ప్రత్యర్థి క్లాడీ జట్టు 79 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఏకంగా 500 పరుగుల విజయం సాధించి నాన్‌ట్‌విచ్ క్లబ్ కొత్త రికార్డు సృష్టించింది.
 

మరిన్ని వార్తలు