అంచనాలు సహజం

29 Jun, 2013 06:34 IST|Sakshi
అంచనాలు సహజం

 ఆటగాళ్లు ఒత్తిడికి భయపడటం లేదు
 భారత్ కెప్టెన్ ధోని వ్యాఖ్య
 
 కింగ్‌స్టన్ (జమైకా):  చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్నా... ప్రస్తుతానికైతే ముక్కోణపు సిరీస్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టామని భారత జట్టు కెప్టెన్ ధోని అన్నాడు. ‘జట్టు డిమాండ్లు మళ్లీ అవే. భారత క్రికెట్ టీమ్ అంటేనే సహజంగా కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాల్సిందే. ముందుకెళ్తున్నకొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి. గత సిరీస్ గెలుపోటములతో సంబంధం లేదు’ అని మహీ వెల్లడించాడు. ఆదివారం సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో  భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో స్నేహపూరిత వాతావరణమే ఇటీవల జట్టు విజయాలకు కారణమని మహీ చెప్పాడు. ఒత్తిడికి భయపడని ఆటగాళ్లు జట్టులో ఉండటం తన అదృష్టమన్నాడు. ‘ఆటగాళ్లు చాలా సులువుగా ఒత్తిడిని జయిస్తున్నారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు.
 
  చాలా మ్యాచ్‌ల్లో విజయాలకు ఇది దోహదపడింది. మొత్తానికి జట్టంతా సమష్టిగా రాణిస్తోంది’ అని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. టీమిండియాలో చోటు కోసం చాలా గట్టి పోటీ నెలకొని ఉన్నా ఇది ఏనాడు వ్యక్తిగత కక్షలకు దారి తీయలేదన్నాడు. ‘కుర్రాళ్లు అవకాశం కోసం ఓపికగా వేచి చూస్తున్నారు తప్పితే.. వేరే వాళ్లు బాగా ఆడకపోతే తనకు అవకాశం వస్తుందని మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చే వరకు ఫామ్‌ను, ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తే అది ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా ప్రభావం చూపుతుంది’ అని మహీ వివరించాడు.
 
 స్పాన్సర్ సెల్‌కాన్
 ముక్కోణపు సిరీస్‌ను ‘సెల్‌కాన్’ మొబైల్ స్పాన్సర్ చేస్తోంది. జమైకాలో ముగ్గురు కెప్టెన్లతో కలిసి సెల్‌కాన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రేతినేని మురళి ట్రోఫీని ఆవిష్కరించారు. ‘ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను స్పాన్సర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. భారత్‌లో క్రికెట్ అంటే చాలా ఆసక్తి చూపుతారు. ఆటతో మేం కూడా మమేకం అయినందుకు గర్విస్తున్నాం. ఇక ముందు కూడా ఆటకు మా మద్దతు కొనసాగిస్తాం’ అని మురళి వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు