‘సిల్లీ ప్రశ్న.. సూపర్బ్‌ రియాక్షన్స్‌’

27 Sep, 2019 15:01 IST|Sakshi
కెనడా టెన్నిస్‌ ప్లేయర్‌ యూజిని బౌచర్డ్‌

కెనడా టెన్నిస్‌ ప్లేయర్‌ యూజిని బౌచర్డ్‌ ఆట పరంగా కాకుండా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. బౌచర్డ్‌ ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో బౌచర్డ్‌కు ట్విటర్‌లో తెగ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆమె చేసే పోస్ట్‌లకు అభిమానులు క్షణాల్లోనే రియాక్ట్‌ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. గతంలో సరదాగా చేసిన ఓ ట్వీట్‌ తెలియని వ్యక్తితో డేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పందెంలో ఓడిపోవడంతో అపరిచిత వ్యక్తితో డేట్‌కు వెళ్లింది. ఈ వార్త అప్పట్లో తెగ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ట్విటర్‌ వేదికగా బౌచర్డ్‌ అడిగిన సిల్లీ ప్రశ్నకు నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్స్‌ వచ్చాయి. దీంతో ఈ టెన్నిస్‌ భామ తెగ ఉబ్బితబ్బిబవుతోంది.

ఇంతకీ ఈ అమ్మడు పోస్ట్‌ చేసిందేమిటంటే. ‘ఆర్డర్‌ చేయడానికి బెస్ట్‌ పిజ్జా ఏంటి?’అని పోస్ట్‌ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. కొందరు నిజాయితీగా తమకు నచ్చిన పిజ్జాలను సూచించారు. అయితే చాలా మంది నెటిజన్లు బౌచర్డ్‌పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేయగా ఆమె ఓపిగ్గా లైక్‌లు కొట్టారు. మరి కొందరు వ్యంగ్యంగా కామెంట్‌ పెడుతున్నారు. పిజ్జాలు పక్కకు పెట్టి.. ముందు ఆటపై దృష్టి పెట్టు అని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేయగా.. మరికొందరు ముందు ఒక్క టోర్నీనైనా గెలువు అని సలహాలు ఇస్తున్నారు. ‘నువ్వు టోర్నీ గెలిచి ఎంతకాలమైందో తెలుసా?’అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. 

సంచలనాలకు మారుపేరైన బౌచర్డ్‌ 2012లో జూనియర్‌ వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి తొలిసారి వార్తల్లోకి ఎక్కింది. అనంతరం 2014లో డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచి మరో సంచలనం సృష్టించింది. అదే ఏడాది యూఎస్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరడంతో భవిష్యత్‌ టెన్నిస్‌ ఆమెదే అని అందరూ భావించారు. కానీ అంచనాలకు మించి ఆడకపోవడంతో కెరీర్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ టోర్నీలో ఏదో ఒక స్టార్‌ క్రీడాకారిణిని మట్టికరిపిస్తోంది. గతేడాది మాడ్రిడ్ ఓపెన్‌లో రష్యా స్టార్‌ ప్లేయర్‌ మరియా షరపోవాను ఓడించటంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఒక్క టోర్నీలో కూడా ఆమె మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. 

మరిన్ని వార్తలు