అభిమానులు తన్నుకున్నారు!

12 Jun, 2016 18:21 IST|Sakshi
అభిమానులు తన్నుకున్నారు!

మర్సెల్లీ:  అసలు ఫుట్ బాల్ అంటేనే ప్రజా భిమానం ఎక్కువ. అందులోనూ యూరో కప్ అంటే మరింత క్రేజ్. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒక మ్యాచ్ సందర్భంగా అభిమానులు కొట్టుకోవడమే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది.  ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్షిప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో విచక్షణ మరచిపోయిన అభిమానులు కొట్లాటకు దిగారు.  ఆదివారం ఇంగ్లండ్-రష్యాల మ్యాచ్లో భాగంగా ఇరు దేశాల అభిమానులు బాహాబాహీ యుద్ధానికి తెరలేపారు. తమ దేశం గొప్పదని ఒకరంటే, కాదు తమ దేశం గ్రేట్ అంటూ  ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ జిల్లాలో అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘటన రణరంగాన్ని తలపించింది. రక్తాలు కారేలా తన్నుకోవడంతో  యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చేసింది. ఫుట్ బాల్ మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందు చోటు చేసుకున్న ఈ ఘటన మ్యాచ్ ముగిశాక కూడా మరింత వేడిని పుట్టించడం గమనార్హం.

ఓ రెస్టారెంట్ టెర్రాస్ పై ఇద్దరు అభిమానుల మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒకర్ని నొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగడంతో  ఒక వ్యక్తి పై నుంచి కిందికి పడిపోయాడు. ఈ ఘటనతో ఉద్రిక్తులైన ఇరు దేశాల అభిమానులు మర్సెల్లీ  స్టేడియానికి బయట రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేన్స్ ప్రయోగించి వారిని చెల్లాచెదురు చేశారు. ఆ తరువాత మ్యాచ్ జరుగుతున్న సమయంలో , మ్యాచ్ ముగిశాక కూడా మరోసారి  ఘర్షణకు దిగారు.


దీనిపై ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నాడ్ కాజేనెవ్యూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్పష్టం చేశారు. ఒక బ్రిటన్ వాసి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఫుట్ బాల్ మ్యాచ్లో అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణను యూరోపియన్ సాకర్ గవర్నింగ్ బాడీ తీవ్రంగా ఖండించింది. ఫుట్ బాల్ అనేది కొట్లాటకు వేదిక కాదన్న సత్యాన్ని ఆయా దేశాల ప్రజలు గ్రహిస్తే మంచిదని పేర్కొంది.  ఇదిలా ఉంచితే ఈ మ్యాచ్ 1-1తో డ్రా ముగియడం  విశేషం.

మరిన్ని వార్తలు