ఫ్రాన్స్.. ‘పాంచ్’ పటాకా

5 Jul, 2016 01:08 IST|Sakshi
ఫ్రాన్స్.. ‘పాంచ్’ పటాకా

యూరో కప్‌లో ఐస్‌లాండ్ సంచలన ప్రదర్శన క్వార్టర్స్‌లో ముగిసింది. సూపర్‌స్టార్లతో నిండిన ఆతిథ్య  ఫ్రాన్స్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే ఆడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే పసికూన ఐస్‌లాండ్ ఈ మ్యాచ్‌లో అసాధారణ తెగువ చూపింది. ఫ్రాన్స్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ ద్వితీయార్ధంలో రెండు గోల్స్ కూడా సాధించి శభాష్ అనిపించుకోగలిగింది. ఇక సెమీస్‌లో తమ చిరకాల శత్రువు జర్మనీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది.
 
* యూరో కప్ సెమీస్‌లోకి ప్రవేశం
* క్వార్టర్స్‌లో 5-2తో ఐస్‌లాండ్‌పై విజయం

పారిస్: యూరో చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఫ్రాన్స్ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్స్‌లో స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో ఆతిథ్య జట్టు 5-2 తేడాతో ఐస్‌లాండ్‌పై నెగ్గింది. దీంతో తమ చిరకాల శత్రువు జర్మనీతో అమీతుమీ తేల్చుకునేందుకు శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బరిలోకి దిగనుంది.

గత ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ జట్టు జర్మనీ చేతిలోనే ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఐస్‌లాండ్‌ను ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు తేలిగ్గా తీసుకోలేదు. వారి బలం, బలహీనలతలపై దృష్టి పెట్టి తగిన వ్యూహాలతో బరిలోకి దిగింది. దీనికి తోడు సొంత అభిమానుల మద్దతుతో ఆరంభం నుంచే చెలరేగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి అటాకింగ్‌తో తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్‌తో పైచేయి సాధించింది. ఓవరాల్‌గా ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ గిరౌడ్ (12, 59వ నిమిషాల్లో), పోగ్బా (20), పయేట్ (43), గ్రిజ్‌మన్ (45) గోల్స్ సాధించారు. ఐస్‌లాండ్‌కు సితోర్సన్ (56), జర్నాసన్ (84) గోల్స్ అందించారు.
 
ఆరంభం నుంచే దూకుడు
మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. దీంతో జట్టు 12వ నిమిషంలో ఖాతా తెరిచింది. మిడ్‌ఫీల్డ్ నుంచి మటౌడి ఇచ్చిన పాస్‌ను ఏరియాలో అందుకున్న గిరౌడ్ గోల్‌గా మలిచాడు. 18వ నిమిషంలో ఐస్‌లాండ్ ఆటగాడు బొడ్‌వర్సన్ హెడర్ ప్రయత్నం నేరుగా గోల్‌కీపర్ లోరిస్ చేతుల్లోకి వెళ్లింది. కానీ మరో నిమిషంలోనే రైట్ వింగ్ కార్నర్ నుంచి గ్రిజ్‌మన్ ఇచ్చిన పాస్‌ను పాల్ పోగ్బా హెడర్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.

ఇదే జోరుతో ప్రథమార్ధం మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఫ్రాన్స్ రెండు గోల్స్‌తో రెచ్చిపోయింది. 43వ నిమిషంలో గ్రిజ్‌మన్ ఇచ్చిన పాస్‌ను ఐస్‌లాండ్ ముగ్గురు డిఫెండర్లకు చిక్కకుండా బాటమ్ కార్నర్ వైపు గోల్ చేయగా 45వ నిమిషంలో బ్యాక్ నుంచి పోగ్బా ఇచ్చిన లాంగ్ పాస్‌ను అందుకున్న గ్రిజ్‌మన్ బంతిని కాస్త ముందుకు తీసుకెళ్లి చిప్ షాట్‌తో గోల్ కీపర్ పైనుంచి నెట్‌లోకి పంపి ఫస్ట్ హాఫ్‌ను 4-0తో ముగించాడు. 56వ నిమిషంలో ఐస్‌లాండ్ మ్యాచ్‌లో బోణీ చేసింది.

రైట్ ఫ్లాంక్ నుంచి సిగర్డ్‌సన్ ఇచ్చిన క్రాస్‌ను పోస్టుకు అతి సమీపం నుంచి సితోర్సన్ గోల్ చేశాడు. అయితే వెంటనే కోలుకున్న ఫ్రాన్స్ 59వ నిమిషంలోనే ఐదో గోల్ చేసింది. 40 గజాల దూరం నుంచి సంధించిన పయేట్ ఫ్రీకిక్‌ను వేగంగా అందుకున్న గిరౌడ్ హెడర్‌తో గోల్ చేశాడు. పలు ప్రయత్నాల అనంతరం ఐస్‌లాండ్ ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించి రెండో గోల్ చేయగలిగింది. అరి స్కులసోన్ క్రాస్‌ను జర్నాసన్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగినా ప్రయోజనం లేకపోయింది.
 
సెమీస్‌లో ఎవరితో ఎవరు
పోర్చుగల్ X వేల్స్
గురువారం రాత్రి 12.30 గంటల నుంచి
 
జర్మనీ X ఫ్రాన్స్
శుక్రవారం రాత్రి 12.30 గంటల నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం


1 యూరోలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగిన జట్టుగా ఐస్‌లాండ్ చరిత్ర సృష్టించింది.

మరిన్ని వార్తలు