అమలు చేస్తారా? తప్పించమంటారా?

7 Oct, 2016 09:26 IST|Sakshi
అమలు చేస్తారా? తప్పించమంటారా?

లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిందే
లేదంటే బోర్డులో అందరినీ మార్చేస్తాం
బీసీసీఐకి నేటి వరకు గడువు నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు 


న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్రతిపాదనల అమలులో జాప్యం చేస్తున్న బీసీసీఐపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర స్థారుులో విరుచుకుపడింది. ‘సంస్కరణలను అమలు చేస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా?’ అంటూ ప్రశ్నించింది. బేషరతుగా అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనంటూ బోర్డుకు నేటి (శుక్రవారం) వరకు గడువునిచ్చింది. ఎటూ తేల్చుకోకుంటే తామే తుది తీర్పునిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ వైఖరేమిటో కనుక్కోవాలని వారి కౌన్సిల్ కపిల్ సిబల్‌ను కోర్టు అడిగింది. అరుుతే వీటి అమలు కోసం ఆయన మరికొంత సమయం గడువు కోరినా కోర్టు తిరస్కరించింది. ‘అసలేం కావాలి మీకు? ప్రతిపాదనలు ఆమోదిస్తామని రేపటి కల్లా(శుక్రవారం) లిఖితపూర్వకంగా సమాధానమివ్వండి. లేకపోతే మేమే తుది తీర్పు ఇచ్చేస్తాం’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా హెచ్చరించారు. బీసీసీఐ నిర్లక్ష్య వైఖరిపై గత వారం లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై గురువారం కోర్టులో ఈ విచారణ జరిగింది.

అందరినీ తొలగిస్తాం..
బోర్డు ప్రక్షాళన కోసం లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని బీసీసీఐకి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అందుకే తమ అభ్యంతరాలపై కోర్టులో మరోసారి వాదనలను వినిపించింది. అరుుతే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది. ఎట్టిపరిస్థితిల్లోనూ సంస్కరణలను నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గాన్ని, అధికారులందరినీ మార్చి బోర్డు నిర్వహణకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కానీ తమిళనాడు సొసైటీల చట్టం ప్రకారం బీసీసీఐ నమోదైందని, దీని ప్రకారం వీటిని అమలు చేయాలంటే అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుందని సిబల్ వాదించారు. దీనికి జస్టిస్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ‘అసలు అన్ని సంఘాలను బీసీసీఐయే నడిపిస్తోంది. అదే ఇప్పుడు లోధా ప్రతిపాదనలకు అడ్డంకులను సృష్టిస్తోంది. వ్యతిరేకించే సంఘాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపేయండి లేదా నిషేధించండి. అంతేకానీ మా సమయాన్ని వృథా చేయకండి. మెజారిటీయే అవసరమని మీరు భావిస్తే అమలు కోసం మేం ఆదేశాలు జారీ చేస్తాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నేనూ కెప్టెన్‌నే...
బీసీసీఐ ఆఫీస్ బేరర్ల అర్హత గురించి వచ్చిన చర్చ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ క్రికెటర్ అరుుతే తాను కూడా క్రికెటర్‌నే అన్నారు. ‘బోర్డుకు ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లకు ఏమైనా ప్రత్యేక అర్హత ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కదా?’ అని కపిల్ సిబల్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అరుుతే అనురాగ్ ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని కపిల్ రెట్టించి చెప్పడంతో తానూ సుప్రీం కోర్టు జడ్జిల జట్టుకు కెప్టెన్‌నే అని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. 

 

మరిన్ని వార్తలు