వెల్‌డన్‌... వింబుల్డన్‌ 

11 Jul, 2020 01:49 IST|Sakshi

ఈ ఏడాది టోర్నీ జరగకపోయినా క్రీడాకారులకు ప్రైజ్‌మనీ పంపకం

లండన్‌: కరోనాతో ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ రద్దయింది. కానీ ఈ మెగా టోర్నీ కోసం గంపెడాశలతో సిద్ధమైన ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? వారి ఆర్థిక వ్యయప్రయాసల సంగతేంటి? ఇదే కోణంలో ఆలోచించిన ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌ తమ ప్రతిష్టను పెంచే నిర్ణయం తీసుకుంది. మెయిన్‌ ‘డ్రా’ సహా క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఆడగలిగే అర్హతలున్న ఆటగాళ్లకు కొంత ప్రైజ్‌మనీ ఇవ్వాలని నిర్ణయించింది.

ఇందు కోసం కోటీ 66 వేల పౌండ్లతో (రూ. 95 కోట్లు) నిధిని కేటాయించింది. ప్రపంచ ర్యాంకింగ్‌ ఆధారంగా ఈ ప్రైజ్‌ మనీ వితరణ ఉంటుంది. క్వాలిఫయింగ్‌ ర్యాంకు అర్హత ఉన్న 224 ప్లేయర్లకు 12,500 పౌండ్లు (రూ.11 లక్షల 88 వేలు) చొప్పున, మెయిన్‌ ‘డ్రా’లో ఆడగలిగే 256 మంది క్రీడాకారులకు 25 వేల పౌండ్లు (రూ. 23 లక్షల 77 వేలు) చొప్పున, 120 మంది మెయిన్‌ ‘డ్రా’ డబుల్స్‌ ఆటగాళ్లకు 6,250 పౌండ్లు (రూ.5 లక్షల 94 వేలు) చొప్పున ఇవ్వనున్నారు. వీల్‌చైర్‌ ఆటగాళ్లకు 6,000 (రూ. 5 లక్షల 70 వేలు) చొప్పున, క్వాడ్‌ వీల్‌చైర్‌ ఆటగాళ్లకు 5,000 పౌండ్లు (రూ. 4 లక్షల 75 వేలు) చొప్పున అందజేస్తారు.

మరిన్ని వార్తలు