ఇక నుంచి ప్రతీది ముఖ్యమే: రహానే

30 Aug, 2019 13:17 IST|Sakshi

జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం నుంచి కింగ్‌స్టన్‌ వేదికగా ఆరంభం కానున్న రెండో  టెస్టును సైతం గెలిచి సిరీస్‌ను స్వీప్‌ చేయాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మేరకు తొలి టెస్టులో హాఫ్‌ సెంచరీ, సెంచరీతో రాణించిన భారత ఆటగాడు అజింక్యా రహానే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆడే ప్రతీ టెస్టు మ్యాచ్‌ వరల్డ్‌ టెస్టు మ్యాచ్‌లో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఇది వరల్డ్‌ టెస్టు చాంపియన్‌లో భాగం కావడంతో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమైనదేనని పేర్కొన్నాడు.

‘తొలి టెస్టులో సాధించిన విజయంతో మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. క్రికెట్‌ అనేది ఒక వింత క్రీడ. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము. దాంతో విండీస్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదు. విండీస్‌ కూడా మంచి జట్టే. మా  వంద శాతం ఆటను ప్రదర్శించడానికి శాయశక్తులా కష్టపడతా. ఆంటిగ్వాలో సాధించిన భారీ విజయాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలనుకుంటున్నాం’ అని రహానే చెప్పుకొచ్చాడు.ఇక విండీస్‌తో టెస్టు సిరీస్‌ తనకు చాలా ప్రత్యేకమైనదన్నాడు. రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన శ్రమకు తగ్గ ఫలితం లభించదని రహానే పేర్కొన్నాడు.  ప్రతీ గేమ్‌ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం గురించే ఎక్కువగా ఆలోచిస్తానన్న రహానే.. రికార్డుల గురించి మాత్రం అస్సలు ఆలోచించనన్నాడు.

ఇటీవల వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ముఖాముఖి సిరీస్‌ల ద్వారానే పాయింట్లు కేటాయించి టెస్టు జగజ్జేత ఎవరో తేల్చనున్నారు. ఇందుకోసం మొత్తం 9 దేశాలు పోటీలో ఉండగా, 27 సిరీస్‌లలో భాగంగా వీటి మధ్య రెండేళ్ల వ్యవధిలో 71 టెస్టులు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ప్రతి జట్టు ఇంటా, బయటా మూడేసి సిరీస్‌లు ఆడుతుంది. నిర్ణీత గడువు (2021 జూన్‌) వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్‌ వేదికగా ఫైనల్‌ (72వ టెస్టు) ఆడతాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా