'ధోని గురించి తెలియంది చాలా వుంది'

29 Sep, 2016 13:28 IST|Sakshi
'ధోని గురించి తెలియంది చాలా వుంది'

చెన్నై:టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోని: ద అన్ టోల్డ్ స్టోరీ'. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై  ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ధోని పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే స్ఫూర్తిదాయకమైన ధోని  జీవితం గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉందని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి భూమిక చావ్లా పేర్కొన్నారు.

 

దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న భూమిక.. ఈ చిత్రంలో ధోనికి సిస్టర్ పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగా చిత్ర ప్రమోషన్ లో మాట్లాడిన భూమిక ధోని జీవితం గురించి తెలియని స్టోరీ అనేక ఉందని పేర్కొంది. 'ధోని జీవితం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ధోని జీవితం గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమాల్లో పని చేశాక అతని స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి తెలుసుకున్నా. ధోని వ్యక్తిగతం గురించి చాలా మందికి పూర్తిగా తెలియదని అనుకుంటున్నా. అతను ఏ విధంగా మనకు ఆదర్శవంతంగా నిలిచాడు అనేది దానిపై ఇప్పుడు చాలా మందిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది'అని భూమిక పేర్కొంది.

 

కాగా, ధోని సిస్టర్ జయంతిగా తనను చూపించడంపై భూమిక ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా జయంతిని తాను ఎప్పుడూ కలవలేదని,  ఆ క్యారెక్టర్ ను డైరెక్టర్ నీరజ్ తనకు అర్ధమయ్యేలా చెప్పడంతో సులభంగా నటించేశానని భూమిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు