అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..!

3 Apr, 2020 16:18 IST|Sakshi

న్యూడిల్లీ: ఆర్థికంగా ఆయా ఆటగాళ్లను ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌ సరిపోతుంది. అలాంటిది లీగ్‌ జరగకపోతే ఇక ఈ ఏడాది ఆట గురించి, డబ్బు గురించి మరచిపోవడమే అవుతుంది.  కరోనా కారణంగా ఈసారి 2020 ఐపీఎల్‌ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది.  అంతా చక్కబడితే సెప్టెంబరు–అక్టోబరు సమయంలో లీగ్‌ జరగవచ్చని వినిపిస్తున్నా... అది అంత సులువు కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్లకు రూపాయి కూడా చెల్లించలేమని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. 

మరి ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ జరగాలని క్రికెటర్లంతా కోరుకుంటారు. కొత్త కుర్రాళ్లు, అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఇందుకోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడ అదే స్థితిని ఎదుర్కొంటున్నాడు ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌.  ఈ ఐపీఎల్‌  వేలంలో కమ్మిన్స్‌ కనీస ధర రెండు కోట్లు ఉండగా అతనికి రూ. 15.50 కోట్ల భారీ ధర పలికింది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్‌ కోసం పోటీ పడగా చివరకూ  కేకేఆర్‌ కమిన్స్‌ను దక్కించుకుంది.  ఫలితంగా ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు.

ఒకవైపు అత్యధిక ధర పలికిందని ఈ సీజన్‌కు కసిదీరా సన్నద్ధమయ్యే తరుణంలో కరోనా మహమ్మారి అంతా కకావికలం చేసింది. అయితే ఐపీఎల్‌ జరుగుతుందని ఆశతోనే ఉన్నాడు కమిన్స్‌.  ‘ ప్రతీ ఒక్కరూ ఐపీఎల్‌ కోసం సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్‌ జరుగుతుందనే ఆశతో ఇంకా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే ఐపీఎల్‌ జరుగుతుంది. ఇది నిజంగా కష్ట సమయం. అంతా నమ్మకంతో ఉండాలి. మనపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏదొక సమయంలో మనమే గెలుస్తాం. ఈ ఏడాది చాలా భిన్నంగా ముందుకు వెళుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సరిగ్గా టోర్నమెంట్‌లు జరగడాన్నే చూడలేదు’ అని కమిన్స్‌ తెలిపాడు. 

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌,ఇటలీ, చైనా తదితర దేశాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ ఐదు వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌ రాగా, 26 మంది మృతి చెందారు.(ఐపీఎల్‌కు ఆసీస్‌ ఆటగాళ్లు గుడ్‌ బై!)

>
మరిన్ని వార్తలు