వెస్టిండీస్‌దే పైచేయి 

2 Jun, 2018 01:41 IST|Sakshi

వరల్డ్‌ ఎలెవన్‌పై 72 పరుగులతో ఘనవిజయం

చెలరేగిన ఎవిన్‌ లూయీస్‌  

లండన్‌: ప్రపంచ టి20 చాంపియన్‌ వెస్టిండీస్‌ ఈ ఫార్మాట్‌లో తన సత్తా మరోసారి చాటింది. వేర్వేరు దేశాలకు చెందిన ఆటగాళ్లతో కూడిన జట్టుపై కరీబియన్‌ సేన పైచేయి సాధించింది. లార్డ్స్‌ మైదానంలో భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన హరికేన్‌ రిలీఫ్‌ టి20 చాలెంజ్‌ మ్యాచ్‌లో విండీస్‌ 72 పరుగుల తేడాతో వరల్డ్‌ ఎలెవన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, వరల్డ్‌ ఎలెవన్‌ 16.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఎనిమిది నెలల క్రితం ఇర్మా, మారియా తుఫాన్ల కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న వెస్టిండీస్‌ స్టేడియాలను పునరుద్ధరించేందుకు నిధుల సేకరణ నిమిత్తం నిర్వహించిన ఈ మ్యాచ్‌కు ఐసీసీ అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చింది.  

వెస్టిండీస్‌ ఓపెనర్లలో ఎవిన్‌ లూయీస్‌ (26 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోగా, క్రిస్‌ గేల్‌ (28 బంతుల్లో 18; 1 ఫోర్‌) తన శైలికి భిన్నంగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జోడించిన అనంతరం లూయీస్‌ను రషీద్‌ ఎల్బీగా వెనక్కి పంపించాడు. ఆ వెంటనే ఆఫ్రిది బౌలింగ్‌లో ఫ్లెచర్‌ (7) స్టంపౌటయ్యాడు. ఈ దశలో మార్లోన్‌ శామ్యూల్స్‌ (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ రామ్‌దిన్‌ (25 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడి పరుగులు సాధించారు. శామ్యూల్స్‌ వెనుదిరిగినా... రామ్‌దిన్, ఆండ్రీ రసెల్‌ (10 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) కలిసి ఐదో వికెట్‌కు 19 బంతుల్లోనే 47 పరుగులు జోడించడంలో విండీస్‌ భారీ స్కోరు సాధించింది.  

 భారీ లక్ష్య ఛేదనలో వరల్డ్‌ ఎలెవన్‌ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తమీమ్‌ ఇక్బాల్‌ (2), ల్యూక్‌ రోంచి (0), బిల్లింగ్స్‌ (4), దినేశ్‌ కార్తీక్‌ (0) విఫలమయ్యారు. షోయబ్‌ మాలిక్‌ (12), షాహిద్‌ ఆఫ్రిది (11) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తిసారా పెరీరా (37 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే పోరాడి అర్ధ సెంచరీ సాధించినా లాభం లేకపోయింది. 20 బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.  

నిబంధనలు సడలించి... 
పేరుకు అంతర్జాతీయ మ్యాచ్‌ అయినా ఇక్కడ రెండు అంశాలపై అందరి దృష్టీ నిలిచింది. మ్యాచ్‌ నడుస్తున్న సమయంలో మైదానంలో కామెంటేటర్‌ను నిలబెట్టి (రోవింగ్‌ రిపోర్టర్‌ పేరుతో) ప్రసారకర్త స్కై స్పోర్ట్స్‌ ప్రయోగాత్మకంగా వ్యాఖ్యానం వినిపించింది. రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన షాహిద్‌ ఆఫ్రిది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రన్నర్‌ సహాయంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. మరోవైపు ‘ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌’గా ఇక్కడ సహచరుల నుంచి గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ అందుకున్న ఆఫ్రిది, ఛారిటీ కోసం తన ఫౌండేషన్‌ తరఫు నుంచి 20 వేల డాలర్లు విరాళం అందించాడు.   

మరిన్ని వార్తలు