ఈ టెస్టు ‘నాలుగు రోజులే’ 

26 Dec, 2017 00:15 IST|Sakshi

నేటి నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య ప్రయోగాత్మక డేనైట్‌ టెస్టు 

క్రికెట్‌ మారుతోంది. అయినా ఈ ఆటలో మార్పులు కొత్తేం కాదు. ఐదు రోజుల టెస్టులుండగానే వన్డేలొచ్చాయి. ఈ రెండు ఫార్మాట్లు అలరిస్తుంటే... టి20లు మెరిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫార్మాట్‌ కాదు కానీ... ఉన్న ఐదు రోజుల టెస్టే... నాలుగు రోజులుగా మారింది. ఇప్పుడైతే ఇది ప్రయోగాత్మకమే! పూర్తిస్థాయిలో మాత్రం కాదు. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య జరిగే నాలుగు రోజుల డేనైట్‌ టెస్టుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి ఇక్కడి సెయింట్‌ జార్జ్‌ పార్క్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 

పోర్ట్‌ ఎలిజబెత్‌:  సంప్రదాయ టెస్టుకు కాస్త భిన్నమైన నిబంధనలతో ఈ మ్యాచ్‌ నిర్వహిస్తారు. రోజూ 90 ఓవర్లకు బదులు 98 ఓవర్లు... రోజూ ఆడే ఆరు గంటలు కాకుండా ఆరున్నర గంటలకు నిడివి పెంచారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం.1.30 మ్యాచ్‌ మొదలవుతుంది. తొలి, రెండో సెషన్లు 2.15 గంటల పాటు, డిన్నర్‌ బ్రేక్‌ తర్వాత మూడో సెషన్‌ను 2 గంటల పాటు నిర్వహిస్తారు. సహజంగా 200 పరుగులు వెనుకంజలో ఉంటే ఫాలోఆన్‌ ఆడిస్తారు. ఈ నాలుగు రోజుల ఆటలో 150 పరుగుల లోటు ఉంటే ఫాలోఆన్‌ తప్పదు. 1972–73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగనుండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఆరు రోజులు, కొన్ని సార్లయితే మూడు నుంచి పది రోజుల టెస్టులు కూడా జరిగాయి. 1938–39లో చివరిసారిగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య డర్బన్‌లో జరిగిన పది రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 1972 సీజన్‌ తర్వాత టెస్టు ప్రామాణికంగా ఐదు రోజుల ఆటైంది.  

సఫారీకి సెలక్షన్‌ సమస్య... 
చాన్నాళ్ల తర్వాత డివిలియర్స్, స్టెయిన్‌లు దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చారు. దీంతో పాటు ఏడుగురా లేక ఆరుగురి బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలా అని సఫారీ జట్టు సతమతమవుతోంది.  మరోవైపు ఈ టెస్టుకు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ దూరమయ్యే అవకాశముంది. వెన్నెముక గాయంతో అక్టోబర్‌ నుంచి ఆటకు దూరమైన ఈ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా కోలుకోలేదు. ఆమ్లా, ఎల్గర్, డి కాక్, ఫిలాండర్, రబడాలతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు దక్షిణా ఫ్రికాతో ఆడిన మూడు టెస్టుల్లోనూ జింబాబ్వేకు ఇన్నింగ్స్‌ పరాజయాలు ఎదురయ్యాయి. 

సాయంత్రం గం. 5.30 నుంచి  సోనీ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు