నం.1ను నేలకు దించారు

28 Nov, 2015 06:58 IST|Sakshi
నం.1ను నేలకు దించారు

మూడో టెస్టులో భారత్ ఘన విజయం
124 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు
  2-0తో సిరీస్ కోహ్లిసేన సొంతం
  ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్
డిసెంబర్ 3 నుంచి నాలుగో టెస్టు

 దేశమేదైనా.. వేదికేదైనా... గత తొమ్మిదేళ్లుగా నిరాటంకంగా సాగిపోతున్న ప్రపంచ నంబర్‌వన్ దక్షిణాఫ్రికా జైత్రయాత్రకు భారత్ గండి కొట్టింది. పటిష్టమైన జట్లపై అలవోకగా విజయాలు సాధించిన సఫారీలను స్పిన్ ఉచ్చులో బంధించి తడఖా చూపెట్టింది. అచ్చొచ్చిన వికెట్లపై అచ్చెరువొందే ఆటతీరుతో అద్భుత విజయాలు సాధించింది. ఇదే జోరుతో మూడో టెస్టునూ మూడు రోజుల్లోనే ముగించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
 
  నాగ్‌పూర్: ఆట కాస్త ఆలస్యంగా ముగిసినా... ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంచనాలకు అందని జామ్‌తా పిచ్‌పై భారత ‘స్పిన్ త్రయం’మరోసారి సంచలన ప్రదర్శన చేసింది. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులోనూ కోహ్లిసేన 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆమ్లా (167 బంతుల్లో 39; 2 ఫోర్లు), డు ప్లెసిస్ (152 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు మళ్లీ నిరాశపర్చారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు తీశారు. డిసెంబర్ 3 నుంచి ఢిల్లీలో ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 215 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 79 ఆలౌట్
 భారత్ రెండో ఇన్నింగ్స్: 173 ఆలౌట్. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 18; వాన్ జెల్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 5; తాహిర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 8; ఆమ్లా (సి) కోహ్లి (బి) మిశ్రా 39; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 9; డు ప్లెసిస్ (బి) మిశ్రా 39; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; విలాస్ (సి) సాహా (బి) అశ్విన్ 12; హార్మర్ నాటౌట్ 8; రబడ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6; మోర్కెల్ (బి) అశ్విన్ 4; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (89.5 ఓవర్లలో ఆలౌట్) 185.

 వికెట్ల పతనం: 1-17; 2-29; 3-40; 4-58; 5-130; 6-135; 7-164; 8-167; 9-177; 10-185. బౌలింగ్: ఇషాంత్ 15-6-20-0; అశ్విన్ 29.5-7-66-7; జడేజా 25-12-34-0; మిశ్రా 20-2-51-3.
 
 సెషన్-1 డివిలియర్స్ నిరాశ
 32/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ఆరంభంలోనే అశ్విన్ ఇబ్బందులకు గురి చేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ పరుగులకు కళ్లెం వేశాడు. దీంతో ఓ ఎండ్‌లో ఆమ్లా నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో ఎల్గర్ (18), డివిలియర్స్ (9) ఒత్తిడిని అధిగమించలేకపోయారు. చివరకు 18 బంతుల వ్యవధిలో అశ్విన్ ఈ ఇద్దర్ని పెవిలియన్‌కు చేర్చాడు. అయితే తొలి గంటలో బాగా ఇబ్బందిపడ్డ ప్రొటీస్ ఇన్నింగ్స్ డు ప్లెసిస్ రాకతో కాస్త కుదుటపడింది. పూర్తి రక్షణాత్మకంగా ఆడిన అతను జడేజా ఓవర్లలో భారీ షాట్లతో ఒత్తిడిని తగ్గించుకున్నాడు. ఆమ్లా కూడా ఇదే ధోరణి అవలంభించడంతో రెండో గంట ఎలాంటి కుదుపు లేకుండా ఇన్నింగ్స్ సాగింది. ఓవరాల్‌గా మరో వికెట్ పడకుండా ప్రొటీస్ 105/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
 ఓవర్లు: 31; పరుగులు: 73; వికెట్లు: 2
 
  సెషన్-2 కీలక భాగస్వామ్యం
 లంచ్ తర్వాత కోహ్లి... ప్రధానంగా అశ్విన్, మిశ్రాలపైనే ఆధారపడ్డా మధ్యలో వైవిధ్యం కోసం జడేజా, ఇషాంత్‌లను ప్రయోగించాడు. తరచుగా బౌలర్ల ఎండ్‌లు మారడం వల్ల ఆమ్లా, డు ప్లెసిస్‌లు ఇరకాటంలో పడ్డారు. కనీసం సింగిల్స్ తీసే సాహసం కూడా చేయకపోవడంతో తొలి గంటలో (19 ఓవర్లలో 21 పరుగులు) స్కోరు వేగం పూర్తిగా మందగించింది. తర్వాత బంతిని అద్భుతంగా ఫ్లయిట్ చేసిన మిశ్రా డబుల్ బ్రేక్‌తో  సీన్ మార్చేశాడు. ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేశాడు. ఓ చక్కని లెగ్ బ్రేక్‌కు ఆమ్లా షార్ట్ గల్లీలో క్యాచ్ ఇస్తే... ఫుల్ లెంగ్త్ బంతిని ఆడలేక డు ప్లెసిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాదాపు మూడు గంటల పాటు క్రీజులో ఉన్న ఈ జోడి ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేసింది. తర్వాత డుమిని (19), విలాస్ (12)లు టీ వరకు అప్రమత్తంగా వ్యవహరించారు.  
 ఓవర్లు: 31; పరుగులు: 46; వికెట్లు: 2
 
  సెషన్-3 అశ్విన్ హవా
 టీ తర్వాత ప్రొటీస్ ఇన్నింగ్స్ 52 నిమిషాల్లోనే ముగిసింది. ఇషాంత్, మిశ్రాలతో బౌలింగ్ కొనసాగించిన కోహ్లి... రెండో కొత్త బంతిని అశ్విన్‌కు అందించాడు. అంతే ఒక్కసారిగా స్పిన్నర్ విలయం సృష్టించాడు. 82వ ఓవర్ తొలి, చివరి బంతులకు డుమిని, విలాస్‌లను అవుట్ చేసి షాకిచ్చాడు.  అశ్విన్  సాధ్యమైనంత ఎక్కువగా టర్న్ చేయడంతో లోయర్ ఆర్డర్‌కు సవాలుగా మారింది. రెండు ఓవర్లలో రబడతో పాటు మోర్కెల్ (4)ను అవుట్ చేయడంతో సంచలన విజయం భారత్ సొంతమైంది. ఆఖరి స్పెల్‌లో అశ్విన్ 19 బంతుల్లో 4 వికెట్లు తీశాడు.    ఓవర్లు: 13.5; పరుగులు: 34; వికెట్లు: 4
 
9 2006లో దక్షిణాఫ్రికా చివరిసారి లంక చేతిలో 0-2తో సిరీస్ ఓడింది.  ఈ తొమ్మిదేళ్ల కాలంలో విదేశాల్లో ఆడిన 15 సిరీస్‌ల్లో వరుసగా నెగ్గింది. గతంలో  1980-85 మధ్య విండీస్ వరుసగా 18 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది.
 
 7/ 66 జఅశ్విన్ కెరీర్‌లో ఇదే ఉత్తమ గణాంకాలు. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లకు పైగా తీయడం ఇది నాలుగోసారి.

 55 ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్. క్యాలెండర్ ఏడాదిలో 50కిపైగా  వికెట్లు తీసిన 12వ భారతీయ బౌలర్ కూడా అతనే. 2008లో హర్భజన్ 63 వికెట్లు పడగొట్టాడు.

 1 1900 సంవత్సరం తర్వాత ఏ బ్యాట్స్‌మన్ 40 పరుగుల   కంటే ఎక్కువ చేయకుండా ఓ టెస్టులో ఫలితం రావడం ఇదే తొలిసారి.   ఈ మ్యాచ్ మొత్తంలో విజయ్ ఒక్కడే 40 పరుగులు చేశాడు.

1 స్వదేశంలో కెప్టెన్‌గా కోహ్లికి తొలి టెస్టు సిరీస్ విజయం.
 

మరిన్ని వార్తలు