అయ్యో.. అది ఔటా?

20 Jun, 2019 08:51 IST|Sakshi
బ్యాట్‌ను బంతి తాకినట్లు స్పష్టం చేస్తున్న అల్ట్రా ఎడ్జ్‌

కొంపముంచిన దక్షిణాఫ్రికా అలసత్వం

విలియమ్సన్‌ ఔట్‌ను గుర్తించని ఆటగాళ్లు

బర్మింగ్‌హామ్‌ : ‘పోరాడు...నీ ఆఖరి శ్వాస ఆగిపోయేవరకు పోరాడుతూనే ఉండూ’ అంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఆఖరి క్షణం వరకు లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలని చెబుతారు. క్రికెట్‌లో ఈ సూక్తిని ప్రతి జట్టు పాటించాల్సిందే. కానీ దక్షిణాఫ్రికా అందుకు విరుద్దంగా ప్రవర్తించి గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 4 వికెట్లతేడాతో ఓడి టైటిల్‌ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ ఓడిపోయేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తాము అలా జరగనివ్వం అన్నట్లుగా కనిపించింది దక్షిణాఫ్రికా పరిస్థితి! ఫీల్డింగ్‌ వైఫల్యాలు, రనౌట్‌ వదిలేయడంతో పాటు కీలకమైన సమయంలో ఆ జట్టు పెద్ద తప్పిదం చేసింది. తాహిర్‌ చివరి ఓవర్‌ ఆఖరి బంతి విలియమ్సన్‌ బ్యాట్‌ను అలా తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. తాహిర్‌ గట్టిగానే అప్పీల్‌ చేసినా ఏదో లోకంలో ఉన్నట్లు కనిపించిన కీపర్‌ డి కాక్‌ కనీసం స్పందించలేదు. దాంతో తాహిర్‌ నిరాశగా వెనుదిరిగాడు. తర్వాత రీప్లే చూస్తే విలియమ్సన్‌ ఔటయ్యేవాడని తేలింది. ఆ సమయానికి కివీస్‌ 67 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. నిజంగా విలియమ్సన్‌ వికెట్‌ తీసి ఉంటే మ్యాచ్‌ సఫారీల చేతుల్లోకి వచ్చేసేదే. దక్షిణాఫ్రికా దురదృష్టం ఏమిటంటే ఆ జట్టుకు ఒక రివ్యూ కూడా మిగిలి ఉంది. ఆటగాళ్లు అన్యమనస్కంగా ఉండి అప్పటికే చేతులెత్తేయడంతో ఇలాంటి మంచి అవకాశం వారికి చేజారింది.   

దీనిపై మ్యాచ్‌ అనంతరం సఫారీ సారథి డూప్లెసిస్‌ స్పందిస్తూ.. ‘ నిజంగా దాని గురించి మాకు తెలియదు. ఆ సమయంలో నేను లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాననుకుంటా. మేం అప్పీలు కూడా చేయలేదు. అప్పటికి డికాక్‌ను అడిగాను. అది ఔట్‌ అని మ్యాచ్‌ అనంతరమే తెలిసింది. విలియమ్సన్‌ కూడా ఔటైనట్లు అనిపించలేదన్నాడు. కానీ ఇదే మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపిందని మాత్రం అనుకోవడం లేదు.’  అని చెప్పుకొచ్చాడు.

చదవండి: విన్నర్‌ విలియమ్సన్‌

మరిన్ని వార్తలు