‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’

25 Jan, 2019 08:49 IST|Sakshi

దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌

డర్భన్‌ : మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత మంగళవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా సర్ఫరాజ్‌ ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఫెలుక్‌వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అతనిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ మాత్రం సర్ఫరాజ్‌ను క్షమిస్తున్నామని ప్రకటించాడు. ‘అతను తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. దీంతో అతన్ని మేం మన్నిస్తున్నాం. ఇక ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో ఐసీసీ ఇష్టం.’ అని క్రిక్‌ఇన్‌ఫోతో అన్నాడు.

క్రీజ్‌లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్‌వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్‌ కెప్టెన్‌ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. అనంతరం సర్ఫరాజ్‌ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్‌ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు