ధోని దమ్మున్న సారథి 

15 May, 2020 03:20 IST|Sakshi

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డుప్లెసిస్‌

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దమ్మున్న నాయకుడని దక్షిణాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్‌ అన్నాడు. అతనో అసాధారణ, ప్రత్యేకమైన నాయకుడని కొనియాడాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో ధోని సహచరుడైన డుప్లెసిస్‌ గురువారం ఫేస్‌బుక్‌ లైవ్‌ చాట్‌లో బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌తో మాట్లాడుతూ... మహీ నాయకత్వ లక్షణాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని చదవడంలో ధోని దిట్ట. మైదానంలో ఉన్నపళంగా తీసుకునే సరైన నిర్ణయాలే ధోనిని ప్రత్యేకంగా నిలిపాయి.

ఆటలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా అతను వెనుకాడడు. ఆ సాహసాలే అతన్ని దమ్మున్న నాయకుడిగా నిలబెట్టాయి. కెప్టెన్‌ అంటే తరచుగా జట్టు సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వాలేమో అనుకునేవాడిని. కానీ ధోనిని చూశాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అతని క్రికెట్‌ బుర్రకు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే’ అని డుప్లెసిస్‌ వివరించాడు. ఆసీస్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌ నిర్వహణపై మాట్లాడుతూ టోర్నీకి ముందు, తర్వాత ఆటగాళ్లను రెండేసి వారాలు ఐసోలేషన్‌లో ఉంచితే ఈవెంట్‌కు ఏ ఇబ్బంది ఉండదని సూచించాడు.

మరిన్ని వార్తలు