2019 వరల్డ్‌కప్‌ పాకిస్తాన్‌దే

25 Aug, 2018 19:41 IST|Sakshi
ఫకార్‌ జమాన్‌ (ఫైల్‌ ఫొటో)

పాక్‌ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ ధీమా

ఇస్లామాబాద్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న 2019 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌ గెలుస్తుందని ఆ జట్టు ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత జింబాబ్వే పర్యటనలో చెలరేగతున్న ఫకార్‌.. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి పాక్‌ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  తన ప్రస్తుత టార్గెట్‌ మాత్రం ఆసియాకప్‌లో రాణించడమేనన్నాడు.

‘పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం సమతూకంతో ఉంది. ఇటీవల జట్టు సాధించిన విజయాలే దానికి నిదర్శనం. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ను పాక్ జట్టే గెలుస్తుంది. టోర్నీలో మా జట్టు కచ్చితంగా హాట్ ఫేవరెట్. ప్రస్తుతం నా టార్గెట్.. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌‌లో మెరుగ్గా రాణించడమే. ఆ తర్వాత ప్రపంచకప్‌పై దృష్టి పెడతాను’ అని ఫకార్ జమాన్ వెల్లడించాడు. 

ప్రపంచకప్‌కు చాలా సమయం ఉండటంతో ప్రస్తుతం ఉ‍న్న సిరీస్‌లపై దృష్టిసారిస్తున్నట్లు స్పష్టం చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌ ఓ ఆటగాడి నైపుణ్యాన్ని భయటపెడుతుందని, ఈ ఫార్మాట్‌ రాణించడం తన కల అని చెప్పుకొచ్చాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 210 పరుగులు చేసి.. పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా ఫకార్ జమాన్ నిలిచాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 18 వన్డేలాడిన ఈ హిట్టర్ ఏకంగా 1,065 పరుగులు చేయగా.. 22 టీ20ల్లో 646 పరుగులతో మెరిశాడు. గత ఏడాది భారత జట్టుతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ శతకం సాధించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు