ఫఖర్‌ సరికొత్త వన్డే రికార్డు

22 Jul, 2018 15:49 IST|Sakshi

బులవాయో: జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో డబుల్‌ సెంచరీ సాధించి ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఫఖర్‌ జమాన్‌ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం చివరిదైన ఐదో వన్డేలో ఫఖర్‌ జమాన్‌(85; 83 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా వన్డేల్లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.  ఈ మ్యాచ్‌కు ముందు వెయ్యి పరుగుల ఘనతను చేరడానికి 20 పరుగుల దూరంలో ఉన్న ఫఖర్‌ దాన్ని సునాయాసంగా చేరుకున్నాడు.

దాంతో విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌, కెవిన్‌ పీటర్సన్, డికాక్‌, బాబర్‌ అజమ్‌ల రికార్డును బ్రేక్‌ చేశాడు. వీరంతా వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కును చేరడానికి 21 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, ఫఖర్‌ జమాన్‌ 18వ వన్డేలోనే ఈ ఘనత సాధించాడు.  గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో  మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఫఖర్‌.. ఆ టోర్నీలో మొత్తంగా 252 పరుగులు చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై అతను సమయోచిత శతకం బాది టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ఫఖర్‌ జమాన్‌ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత.. వన్డే జట్టులో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగుతున్న జమాన్.. తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు వన్డేల్లో జమాన్ వరుస ఇన్నింగ్స్‌ల్లో (60, 117 నాటౌట్, 43 నాటౌట్, 210 నాటౌట్, 85) దుమ్ములేపాడు.

చదవండి: నయా 'జమానా'

మరిన్ని వార్తలు