రక్తంతో అభిమాని లేఖ.. వణికిపోయిన కోహ్లి!

3 May, 2018 14:10 IST|Sakshi

ముంబై : ప్రస్తుతం క్రికెట్‌లో ఎక్కువమంది అభిమానులు ఉన్న క్రికెటర్‌ నిస్సందేహంగా విరాట్‌ కోహ్లినే. మైదానంలో దిగితే చాలు రికార్డుల మోత మోగించే ఈ క్రికెటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. క్రికెట్‌లో వీరోచితమైన బ్యాట్స్‌మన్‌గానే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ చరిష్మాటిక్‌ సెలబ్రిటీగా కోహ్లిని ఎంతోమంది ఆరాధిస్తారు. ఇక మహిళా అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, అభిమానం కూడా హద్దు మీరితే.. దానిని ఎదుర్కొన్నవారికి కొన్నిసార్లు చేదు అనుభవమే మిగులుతుంది. ఇలా మితిమీరిన అభిమానంతో తనను బెంబేలెత్తించిన ఓ సంఘటన గురించి తాజాగా కోహ్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘రక్తంతో రాసిన లేఖను నాకు ఒకరు ఇచ్చారు. మనస్సు చివుక్కుమంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను కారులో వెళుతుండగా.. కారు అద్దాలను దింపాను. అంతలోనే ఒక కాగితం వచ్చి పడింది. ఎవరో దానిని ఇచ్చారు. ఎవరు ఇచ్చింది కూడా నేను చూడలేదు. అది రక్తంతో రాసి ఉన్న లేఖ. దానిని పూర్తిగా కూడా చూడలేదు. దానిపై రాసిన వ్యక్తి పేరు ఉంది. వెంటనే దానిని సెక్యూరిటీ పర్సన్‌కు ఇచ్చేశాను. దానిని స్వీకరించలేకపోయాను. ఎంతో భయం వేసింది’ అని కోహ్లి ‘ఎరోస్‌ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఐపీఎల్‌ రావడంతో క్రికెటర్లకు, అభిమానులకు మధ్య గ్యాప్‌ తగ్గిపోయింది. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో క్రికెటర్లు ప్రయాణికులకు ఎదురుపడే సందర్భాలు పెరిగాయి. దీంతో వారు ఎక్కడ కనపడినా.. సెల్ఫీల కోసం ఫ్యాన్స్‌ ఎగబడటం సాధారణంగా మారిపోయింది. ఓసారి విమానంలో ప్రయాణిస్తుండగా తాను నిద్రలో మునిగిపోయానని, ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి తనతో సెల్ఫీ దిగాడని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. ‘ఓసారి నేను ఫ్లయిట్‌లో ఉన్నాను. ఐపీఎల్‌ గేమ్స్‌ సమయంలో అనుకుంటా. చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని నేను పడుకొని ఉన్నాను. లేచి చూసేసరికి నా ఓడిలో ఓ బేబీ ఉంది. ఎవరో నన్ను భుజం తట్టి నిద్రలేపారు. ఒక వ్యక్తి నాతో సెల్ఫీ దిగుతున్నాడు. నేను గ్లాసెస్‌ పెట్టుకోవడంతో మేలుకువతో ఉండి అతన్ని చూస్తున్నాడని అనుకున్నట్టున్నాడు. కానీ నేను అప్పుడు పడుకొని ఉన్నాను’ అని కోహ్లి వివరించాడు.

మరిన్ని వార్తలు