ధోని వల్లే నీ కెరీర్‌ ముగిసింది.. సెహ్వాగ్‌ కౌంటర్‌!

7 Jul, 2018 20:38 IST|Sakshi
ధోని, సెహ్వాగ్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకోవాలని బీసీసీఐకి ఓ కండిషన్‌ పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు ధోని కొంతమంది సీనియర్‌ క్రికెటర్ల ప్రదర్శనను బహిరంగంగానే వ్యతిరేకించాడు. అయితే టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కెరీర్‌ ధోని వల్లే ముగిసిందని అతని అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ విషయంలో సెహ్వాగ్‌ ఎన్నోసార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు.

2007 టీ20 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో సెహ్వాగ్‌ను పక్కనబెట్టి, యూసఫ్‌ పఠాన్‌ తీసుకోవడంతో మొదలైన ఈ ప్రచారం అతను జట్టులో చోటు కోల్పోయి.. రిటైర్మెంట్‌ ప్రకటించినా కూడా జరుగుతూనే ఉంది. ధోని నిర్ణయాల కారణంగానే సెహ్వాగ్ జట్టులో చోటు కోల్పోయాడని అతని అభిమానులు ఇప్పటికి బహిరంగంగానే కామెంట్‌ చేస్తున్నారు. అయితే నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి సెహ్వాగ్‌ తనదైన శైలిలో విషెస్‌ తెలియజేశాడు. ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్‌ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమః!’  అని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 

ఈ పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో ఓ సెహ్వాగ్‌ అభిమాని ‘సెహ్వాగ్‌ సర్‌ కెరీర్‌ను నాశనం చేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని తెలిపాడు. దీనికి సెహ్వాగ్‌ వెంటనే స్పందించాడు. అది చాలా తప్పు కామెంట్‌ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు