ఆసీస్‌ 158, భారత్‌ 169.. విజేత?

21 Nov, 2018 21:01 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణమైన డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్‌ కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్‌ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ప్రత్యర్థి కంటే 11 పరుగులు ఎక్కువగా చేసిన జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింద’ని బాధ పడ్డారు. ట్విటర్‌లో కామెంట్లు, ఫొటోలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఆసీస్‌ కంటే ఎక్కువ స్కోరు చేసినా.. ఓడిన భారత్‌!)

ఆసీస్‌ స్కోరు మీద జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధించడం​ వల్లే టీమిండియా ఓడిపోయిందని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎకసెక్కమాడారు. ఏదేమైనప్పటికీ సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌ మజా అందించిందని పేర్కొన్నారు. ఏ ఆటలోనైనా డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం లోపభూయిష్టమైందని అభిమానులు ధ్వజమెత్తారు. డీ/ఎల్‌ గురించి ఎవరైనా మాకు వివరించండి అంటూ మొరపెట్టుకున్నారు.

పనిలో పనిగా టీమిండియా ఆటగాళ్ల వైఫల్యాలపైనా సెటైర్లు వేశారు. పాండ్యా బ్రదర్స్‌ను సాగనంపే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో ఇద్దరు మాత్రమే స్థాయికి తగ్గటు ఆడారని మిగతా వారంతా ఏమీ చేయలేక చూస్తుండి పోయారని జోకులేశారు. ధోని లాంటి ఫినిషర్‌ లేకపోవడం వల్లే మ్యాచ్‌ చేజారిందని మహి ఫ్యాన్స్‌ నిష్టూరమాడారు.

తమ ఓటమికి 11 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కారణం కాదని, ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు డక్‌వర్త్‌, లూయిస్‌ వల్లే విజయం సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పడం కొసమెరుపు
 

మరిన్ని వార్తలు