పీసీబీ.. పంజాబ్‌ క్రికెట్‌ బోర్డు అయ్యింది!

18 Oct, 2019 17:47 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓవరాల్‌గా జట్టు మొత్తం విఫలమైతే సర్ఫరాజ్‌ను బలి పశువును చేశారంటూ మండిపడుతున్నారు. అసలు సర్ఫరాజ్‌ నుంచి అజహర్‌ అలీకి టెస్టు పగ్గాలు అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌లను చూస్తే అజహర్‌ అలీ పూర్తిగా విఫలమయ్యాడనే విషయాన్ని పీసీబీ పెద్దలు మరిచిపోయారా అంటూ విమర్శిస్తున్నారు. గత ఐదు మ్యాచ్‌ల్లో అజహర్‌ అలీ పేలవ ప్రదర్శన కనిపించలేదా అంటూ పీసీబీని ఎండగడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కాస్తా పంజాబ్‌ క్రికెట్‌ బోర్డు అయిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన మిస్బావుల్‌ హక్‌, వకార్‌ యూనిస్‌లు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అజహర్‌ అలీని కెప్టెన్‌గా నియమించారంటూ  మండిపడుతున్నారు. (ఇక్కడ చదవండి: మిస్బా మార్క్‌.. సర్ఫరాజ్‌ కెప్టెన్సీ ఫట్‌!)

‘ఇదొక అవినీతి నిర్ణయం.. ఇది పంజాబ్‌ క్రికెట్‌ బోర్డు’ అని ఒకరు విమర్శించగా, ‘ అలీని ఎందుకు కెప్టెన్‌గా చేశారు.. బాబర్‌ అజామ్‌నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఈ విషయంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ను బలి పశువునే చేశారు.. శ్రీలంకతో సిరీస్‌లో జట్టు ఓవరాల్‌గా విఫలమైతే సర్ఫరాజ్‌ను తీసేస్తారా’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు.  ‘ శ్రీలంకతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్‌కు ఇది కానుక’ అని మరొకరు చమత్కరించారు. ‘అజహర్‌ అలీ డబ్బులిచ్చి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మరొక అభిమాని ఫైర్‌ అయ్యాడు. 

మరిన్ని వార్తలు