సెమీఫైనల్లో కలకలం

10 Jul, 2019 14:44 IST|Sakshi
ఆందోళనకారుడికి బేడిలు వేసి బయటకు తీసుకెళ్తున్న పోలీసులు

మాంచెస్టర్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మంగళవారం కలకలం రేగింది. ఓల్డ్‌ టఫోర్డ్‌ స్టేడియంలో ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. నలుగురు ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు బేడిలు వేసి స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. అరెస్ట్‌ సందర్భంగా ఆందోళనకారుల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాజకీయ సందేశాలు రాసివున్న టీషర్ట్స్‌ ధరించి నలుగురు సిక్కులు స్టేడియంలోకి వచ్చారని, ఇలాంటి వాటికి అనుమతి లేదన్నారు.

తమకు ప్రత్యేకంగా ఖలిస్తాన్‌ దేశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నలుగురు స్టేడియంలో బ్యానర్లు ప్రదర్శించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర పంజాబ్‌ నుంచి తమను వేరు చేసి ప్రత్యేక దేశం ఇవ్వాలని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రపంచకప్‌ వన్డే మ్యాచ్‌ల్లో ఇంతకుముందు కూడా రాజకీయ సందేశాలున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘కశ్మీర్‌కు న్యాయం చేయాలి’ అంటూ భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది బ్యానర్‌ ప్రదర్శించారు. కాగా, వర్షం కారణంగా మంగళవారం ఆట నిలిచిపోవడంతో భారత్‌-కివీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను నేడు కొనసాగించనున్నారు. (చదవండి: భారత్, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ నేడు కొనసాగింపు)

>
మరిన్ని వార్తలు