అశ్విన్‌ ఏందీ తొండాట..!

26 Mar, 2019 10:17 IST|Sakshi
రవిచంద్రన్‌ అశ్విన్‌

సోషల్‌ మీడియాలో అభిమానుల ఫైర్‌

జైపూర్ ‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై యావత్‌ క్రికెట్‌లోకం మండిపడుతోంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు.. ఏందీ తొండాట.. అని సోషల్‌ మీడియావేదికగా ఆగ్రహం చేస్తున్నారు. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే  రాజస్తాన్ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ ఔట్‌ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌ను అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ ద్వారా ఔట్‌ చేయడమే దీనికి కారణం. అశ్విన్‌ బంతి వేయబోయే సమయానికే బట్లర్‌ క్రీజ్‌ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్‌ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్‌ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది.

నిబంధనల (రూల్‌ 41.16) ప్రకారమైతే థర్డ్‌ అంపైర్‌ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్‌లో ‘జెంటిల్‌మన్‌’గా గుర్తింపు ఉన్న అశ్విన్‌... ఎలాగైనా వికెట్‌ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్‌ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్‌ క్రీజ్‌ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్‌ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది. అయితే కొందరు మాత్రం అశ్విన్‌ తెలివిని ప్రశంసిస్తుండగా.. ఎక్కువ శాతం తొండాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అశ్విన్‌ తీరుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్‌లో నేను ఏం చూశానో దాన్ని అస్సలు నమ్మలేకపోతున్నా.. క్రీడా స్పూర్తి విషయంలో కుర్రాళ్లకు ఇదో ఉదాహరణ. ఈ విషయంలో అశ్విన్‌ పశ్చాతాపపడుతాడు’ అని మోర్గాన్‌ ట్వీట్‌ చేశాడు. జోస్‌బట్లర్‌కు వార్నింగ్‌ ఇస్తే సరిపోయేది.. కానీ అశ్విన్‌ కీడ్రా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మరో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘అశ్విన్‌.. నువ్వు ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు.. ఎందుకీ తొండాట, నీ తీరుతో సిగ్గుపడుతున్నాం’ అంటూ ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి : రాజసం బొక్కబోర్లా

ఇక అశ్విన్‌ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్‌ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తి కాకముందే అతను క్రీజ్‌ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్‌ జాగరూకతతో ఉండటం అవసరం.’ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు