టెస్టులూ కావాలి మాకు! 

10 Mar, 2019 00:15 IST|Sakshi

 ఎంసీసీ సర్వేలో 86 శాతం అభిమానుల ఆసక్తి  

బెంగళూరు: సంప్రదాయక టెస్టు క్రికెట్‌ ప్రాభవం కోల్పోతోందని... ఐదు రోజుల ఆటకు క్రమంగా కాలం చెల్లుతోందని ఈ మధ్య తరచూ వార్తలొస్తున్నాయి. కానీ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) నిర్వహించిన సర్వేలో మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో 86 శాతం మంది క్రికెట్‌ అభిమానులు టెస్టులకు జై కొట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తోపాటు తమకు టెస్టులు చూడటం కూడా ఇష్టమేనని 86 శాతం ఫ్యాన్స్‌ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎంసీసీ టెస్టు క్రికెట్‌ సర్వేను వంద దేశాల్లో నిర్వహించింది. ఇందులో 13 వేల మంది క్రికెట్‌ ప్రేక్షకులు పాల్గొన్నారు. టెస్టు క్రికెట్‌ మరింత విజయవంతం కావడానికి ఆ అభిమానులు విలువైన సూచనలూ ఇచ్చారు.

వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాల్ని, ధరతో పాటు ఆన్‌లైన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ధరల వివరాలే ఉంటున్నాయి. ఎన్ని టికెట్లు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఐదు రోజుల మ్యాచ్‌ల్ని టీవీల్లో ఉచితంగా వీక్షించేందుకు (ఫ్రీ టు ఎయిర్‌) అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పెయిడ్‌ చానళ్లలో ప్రసారమవుతున్నాయి. రోజు మొత్తానికి బదులుగా ‘హాఫ్‌ డే’ టిక్కెట్లు విక్రయించాలని సర్వేలో పాల్గొన్న అభిమానులు తెలిపారు. తాజా సర్వేతో టెస్టు క్రికెట్‌కూ ఆదరణ ఉందని రుజువైందని ఎంసీసీ తెలిపింది. గతేడాది సర్వేలో కూడా 70% ప్రజలు టెస్టులకు మద్దతు తెలిపారు.   

మరిన్ని వార్తలు