కివీస్‌ తొండాట.. ధోని ఔట్‌ కాదు!

11 Jul, 2019 17:15 IST|Sakshi

ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఫీల్డింగ్‌ సెట్టింగ్‌

అంపైర్లపై నెటిజన్లు ఆగ్రహం

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని రనౌట్‌ వివాదస్పదమైంది. ఈ రనౌట్‌తో టీమిండియా గెలుపు సమీకరణాలే మారిపోయి ఓటమి చవిచూసింది. అయితే ధోని రనౌట్‌ సమయంలో ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా కివీస్‌ ఫీల్డింగ్‌ మోహరించిందని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మూడో పవర్‌ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే అప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన ఆరుగురు ఫీల్డర్లు.. సర్కిల్ వెలుపల ఉన్నారు. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోనీ కూడా పరుగు కోసం ప్రయత్నించి ఉండేవాడు కాదన్నది అభిమానుల వాదన.

ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో రసెల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయినప్పుడు నిబంధనలకు విరుద్దంగా ఫీల్డింగ్‌ ఉండటంతో అంపైర్‌ నో బాల్‌ ప్రకటించాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించకపోవడం టీమిండియా కొంపముంచిందని.. ఒకవేళ అంపైర్లు అది నోబాల్‌గా ప్రకటించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ‘నిన్నటి మ్యాచ్‌లో అంపైర్లు నిద్రపోయారు’,‘కివీస్‌ తొండాట.. ధోని ఔట్‌ కాదు’, ‘టీమిండియా ఓడింది ధోని రనౌట్‌తో కాదు అంపైర్ల తప్పిదంతో’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. (చదవండి: కొంపముంచిన ధోని రనౌట్‌!)

మరిన్ని వార్తలు