షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!

23 Jun, 2019 10:13 IST|Sakshi

సౌతాంప్టన్‌ : అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్‌ మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత ఫీట్‌తో ప్రపంచకప్‌లో ఈ ఘనతను అందుకున్న రెండో భారత బౌలర్‌గా షమీ గుర్తింపు పొందాడు. అయితే ఈ హ్యట్రిక్‌ క్రెడిట్‌ మాత్రం మహేంద్రసింగ్‌ ధోనిదేనని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఉత్కంఠకర స్థితిలో లయ తప్పిన మమ్మద్‌ షమీకి ధోని ఇచ్చిన సలహానే అతనికి హ్యాట్రిక్‌ దక్కేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం. బంతిని మహ్మద్‌ షమీ అందుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకోని తమ జట్టు కోసం ఒంటరి పోరాటం చేస్తున్న మహ్మద్‌ నబీది స్ట్రైకింగ్‌. తొలి బంతిని యార్కర్‌ వేయబోయిన షమీ లయతప్పి ఫుల్‌టాస్‌ వేశాడు. ఇంకేముంది ఆ బంతిని నబీ ఫోర్‌గా మల్చాడు. అంతే ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ఉత్కంఠకు తెరలేపింది. బుమ్రా అయితే ఈ బంతిని చూసి ‘ఈ టైంలో ఫుల్‌టాస్‌ ఏంట్రా?’ అన్నట్లు.. తీవ్రంగా అసహనానికి గురయ్యాడు. అయితే మరుసటి బంతిని కట్టడిగా వేయగా.. నబీ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్న తీయలేదు. ఈ సమయంలో ధోని.. షమీ దగ్గరకు పరుగెత్తుకొచ్చి ఏదో సలహా ఇచ్చాడు.

దానికనుగుణంగా ఫీల్డింగ్‌ మార్చుకున్న షమీ.. యార్కర్‌ సంధించాడు. దీన్ని నబీ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా.. ఆ వైపు బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్యాండ్యా చేతిలో పడింది. ఇంకేముందు భారత శిబిరం, ఆటగాళ్ల ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. మరుసటి రెండు బంతులను ఫర్‌ఫెక్ట్‌ యార్కర్లతో అప్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను క్లీన్‌బౌల్డ్‌ చేసి షమీ హ్యాట్రిక్‌ ఘనతను అందుకున్నాడు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదేనంటున్నారు. ఇలా క్లిష్ట పరిస్థితిల్లో వ్యూహాలు రచించడం ధోనికి కొత్తేమి కాదు. చాలా మ్యాచ్‌ల్లో బౌలర్లతో వ్యూహాలు రచించి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు.  

ఇక ప్రపంచకప్‌-2019లో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా షమీ నిలవగా.. ఈ మెగాఈవెంట్‌లో హ్యాట్రిక్‌ తీసిన రెండో భారత బౌలర్‌ గుర్తింపు పొందాడు. 1987లో చేతన్‌ శర్మ భారత్‌ నుంచి ఈ ఘనత సాధించాడు. 
చదవండి : ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

మరిన్ని వార్తలు