కేఎల్‌ రాహుల్‌ ఇంకెందుకు?

25 Nov, 2018 20:31 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌

సోషల్‌ మీడియాలో అభిమానుల ఫైర్‌

ఆసీస్‌ గడ్డపై దారుణంగా విఫలమైన రాహుల్‌

సిడ్నీ : గత కొద్దిరోజులుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియా గడ్డపై సైతం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా రాహుల్‌పై మండిపడుతున్నారు. ఇంకెన్నీ అవకాశాలిస్తారని, రాహుల్‌ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేఎల్‌ రాహుల్‌ మంచి బ్యాట్స్‌మనే కానీ అతను నెట్స్‌లో మాత్రమే ఆడుతాడని సెటైర్లేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశం ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో 20 బంతులాడిన కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు. అది కూడా.. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదినా.. ఆ తర్వాత 18 బంతుల్లోనూ చేసిన పరుగులు 8 మాత్రమే. అయితే.. రాహుల్ విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి (61 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 22 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. 

ఇక బ్రిస్బేన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కూడా రాహుల్‌  విఫలమయ్యాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసి  స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ20లోనూ రాహుల్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్‌ పర్యటనలో అతను సాధించిన అద్భుత సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్‌ లేదు. అయినా టీమిండియా మేనేజ్‌మెంట్‌ రాహుల్‌పై నమ్మకం ఉంచి అవకాశం కల్పించగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

మరిన్ని వార్తలు