‘కల నెరవేరింది’

15 Aug, 2016 02:41 IST|Sakshi
‘కల నెరవేరింది’

రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో ఓ శకం ముగిసింది. కొలనులో బంగారు పతకాల పంట పండించిన దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ ఘనంగా కెరీర్‌కు ముగింపు పలికాడు. 4x100 మీటర్ల మెడ్లే రిలేలో మొదటి స్థానంలో నిలిచి మొత్తం 23 ఒలింపిక్స్ స్వర్ణాలతో మానవమాత్రుడికి సాధ్యంకాని రికార్డుతో కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి ఈవెంట్లో స్వర్ణం గెలవగానే ఫెల్ప్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘అచ్చం ఇలాగే నా కెరీర్ ముగించాలనుకున్నా.
 
 నా కల నేరవేర్చుకున్నా. చివరిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కాస్త ఉద్వేగం కలిగింది. బాల్యంలో ఉన్నప్పుడు ఓ చిన్న కలతో మొదలైన నా ప్రస్థానంతో స్విమ్మింగ్‌కు గతంలో ఎవరూ చేయనంతగా చేయాలనుకున్నా. అనుకున్నది సాధించా’ అని ఫెల్ప్స్ తెలిపాడు. రియో ఆఖరి పోటీని చూసేందుకు భారీ సంఖ్యలో స్విమ్మింగ్ స్టార్స్ అందరూ వచ్చారు. గ్యాలరీలో కూర్చున్న ఫెల్ప్స్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. పతకం అందుకున్నాక ఫెల్ప్స్ కూడా తన క న్నీటిని ఆపుకోలేకపోయాడు.
 
 అమెరికా ‘థౌజండ్’ వాలా
 మహిళల 4x100 మీటర్ల మెడ్లే రిలేలో అమెరికా మహిళల జట్టు (సిమోన్ మాన్యుయేల్, కేథలీన్ బేకర్, లిల్లీ కింగ్, దానా వోల్మర్) స్వర్ణం గెలిచింది. ఈ విజయంతో మొత్తం ఒలింపిక్స్ చరిత్రలో వెయ్యి స్వర్ణ పతకాలు గెలిచిన (1896 ఏథెన్స్ నుంచి 2016 రియో వరకు) జట్టుగా అమెరికా చరిత్ర సృష్టించింది.  మరోవైపు 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లోనూ అమెరికా స్విమ్మర్ సిమోన్ మాన్యుయేల్ స్వర్ణం చేజిక్కించుకుంది.

>
మరిన్ని వార్తలు