టీమిండియా ఆశాకిరణం అతడే

31 Aug, 2018 09:27 IST|Sakshi

అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో రెండో బంతికే సిక్స్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచిన టీమిండియా యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టి.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆకట్టుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ ఆటతీరును మాజీ దిగ్గజ ఆటగాళ్లు మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఫరూఖ్‌ ఇంజనీర్ చేరాడు. పంత్‌ ఆటను చూస్తుంటే తన ఆటను అద్దంలో చూసుకున్నట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో టీమిండియా విజయాల్లో పంత్‌ పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి బ్యాటింగ్‌ విధానంలో, క్రీడాస్పూర్తిని చూపించటంలో సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌లను గుర్తుచేస్తున్నాడని పేర్కొన్నాడు.  

పంత్‌ను ఇంకా ఏమన్నాడంటే..
‘నేను అరంగేట్రం మ్యాచ్‌లో ఒత్తిడికి గురై తొలి మూడు బంతులను ఫోర్లుగా మలిచా.. అప్పుడు నాకేం తెలియదు బంతిని బాదాలని మాత్రమే అనుకున్నా. కానీ పంత్‌ అరంగేట్రం మ్యాచ్‌లో అతడిని చూస్తుంటే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో రెండో బంతిని సిక్స్‌ కోట్టడంతో పాటు, ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ (క్యాచ్‌లు, స్టంపౌట్‌) చేయడంతో అతడి ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపయింది. ఇలాగే కష్టపడితే టీమిండియా భవిష్యత్‌ కిరణం అతడే కావడంలో సందేహమే లేదు. ప్రస్తుత కీపర్లలో ఎంఎస్‌ ధోని తర్వాత నాకు పంత్‌ కీపింగ్‌ స్టైల్‌ చాలా నచ్చింది.’ అంటూ ఫరూఖ్‌ ఇంజనీర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు