బరిందర్‌కు భలే చాన్స్.. తొలి వన్డేలో చోటు!

10 Jan, 2016 13:04 IST|Sakshi
బరిందర్‌కు భలే చాన్స్.. తొలి వన్డేలో చోటు!

పెర్త్‌: ఫాస్ట్‌ బౌలర్‌ బరిందర్‌ స్రాన్‌ భలే చాన్స్ కొట్టేశాడు. ఈ నెల 12న పెర్త్‌లో జరుగనున్న భారత్‌- ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా మారింది. లెఫ్ట్ ఆర్మర్‌ అయిన ఈ 23 ఏళ్ల బౌలర్‌ టీమిండియాకు అదనపు బలం కానున్నాడని, స్రాన్‌ను మంగళవారం జరిగే తొలి వన్డేలో ఆడించే అవకాశముందని భారత బౌలింగ్ కోచ్‌ భరత్ అరుణ్‌ తెలిపారు.

'అతను మంచి శక్తిసామర్థ్యాలున్న బౌలర్. ఆడిన రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను లెఫ్ట్ ఆర్మర్‌ కావడం జట్టుకు అదనపు బలం. భవిష్యత్తులో ఓ మంచి బౌలర్‌ను తయారుచేయడానికి అవసరమైన వ్యక్తి దొరికాడని మేం భావిస్తున్నాం' అని  అరుణ్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం, శనివారం వెస్ట్రర్న్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ట్వంటీ-20, వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయాలు సాధించి.. ఇనుమడించిన ఉత్సాహంతో వన్డేలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో కీలక బౌలర్‌గా భావిస్తున్న మొహమ్మద్ షమీ గాయం కారణంగా వైదొలగడం.. కూడా బరిందర్ స్రాన్‌కు బాగా కలిసి వచ్చింది.  
 

>
మరిన్ని వార్తలు