ఆసీస్‌కు ఊరట

2 Apr, 2014 01:24 IST|Sakshi
ఆసీస్‌కు ఊరట

 బంగ్లాదేశ్‌పై విజయం
 ఆతిథ్య జట్టుకు పూర్తి నిరాశ
 రాణించిన ఫించ్, వార్నర్
 
 సాక్షి, ఢాకా: స్థాయికి తగ్గ ఆటతీరును క నబరచలేక అన్ని పెద్ద జట్ల చేతిలో ఓడి సెమీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా జట్టు... బలహీనమైన ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో ఊరట పొందింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్న బంగ్లాదేశ్... ఆట పరంగా మాత్రం పూర్తి నిరాశతోనే టోర్నీని ముగించింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు సాధించింది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్ రెండు, స్టార్క్, బొలింజర్, వాట్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
 
 ఆస్ట్రేలియా జట్టు 17.3 ఓవర్లలో మూడు వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఫించ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... వైట్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), బెయిలీ (7 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్‌కు రెండు, తస్కిన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 

>
మరిన్ని వార్తలు