భవిష్యత్‌ తార జ్వెరెవ్‌

20 Sep, 2017 01:12 IST|Sakshi
భవిష్యత్‌ తార జ్వెరెవ్‌

ఫెడరర్‌ ఇంటర్వ్యూ

తనలో 36 ఏళ్ల వయస్సులోనూ సత్తా ఏమీ తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో విజేతగా నిలిచాడు. అయితే ఈ నెలలో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో పరాజయం పొందినా... మరిన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గోల్ఫ్‌లో రైడర్‌ కప్‌ మాదిరిగా టెన్నిస్‌లో జరిగే లేవర్‌ కప్‌లో ‘టీమ్‌ యూరోప్‌’ తరఫున ఫెడరర్‌ బరిలోకి దిగబోతున్నాడు.   

ఈ వినూత్నమైన టోర్నమెంట్‌లో ఆడబోతుండటంపై మీ అభిప్రాయం?
చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. గత మూడేళ్ల నుంచి ఈ కప్‌ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పటికి కార్యరూపం దాల్చినందుకు ఆనందంగా ఉంది. టీమ్‌ యూరోప్, రెస్టాఫ్‌ వరల్డ్‌ జట్ల మధ్య జరిగే ఈ ఫార్మాట్‌ గతంలో ఎప్పుడూ చూడనిది. ఇప్పటిదాకా ప్రత్యర్థులుగా భావించిన వారితోనే ఓ జట్టుగా కలిసి ఆడటం సరదాగా ఉండబోతోంది. ఇరు జట్ల కెప్టెన్లు బోర్గ్, జాన్‌ మెకన్రోలతో ఉండటం ఇంకా బావుంది. రాబోయే సంవత్సరాల్లో లేవర్‌ కప్‌ మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్‌ లేవర్‌తో మీ అనుబంధాన్ని పంచుకోగలరా?
నా ఉద్దేశంలో రాడ్‌ లేవర్‌ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాడు. కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆడిన సమయంలో నేను కూడా ఆడి ఉంటే సర్వ్‌ అండ్‌ వాలీలతో ఓడించేందుకు ప్రయత్నించేవాణ్ణి.  

రాఫెల్‌ నాదల్‌తో కలిసి ఒకే జట్టులో ఆడబోతున్నారు. ఎలా అనిపిస్తోంది?
గతంలో ఎన్నడూ చూడని విధంగా టెన్నిస్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆటతో రాఫెల్‌ దూసుకువచ్చాడు. ఇద్దరం కలిసి ఒకే జట్టులో ఆడబోతుండటం నిజంగా నమ్మశక్యంగా అనిపించడం లేదు. డబుల్స్‌లో తనతో ఆడేందుకు అలాగే సింగిల్స్‌ ఆడుతున్నప్పుడు రాఫెల్‌ను ప్రోత్సహించేందుకు ఎదురుచూస్తున్నాను.   

ఇరు జట్ల కెప్టెన్లు బోర్గ్, మెకన్రోల మధ్య ఆ కాలంలో చిరస్మరణీయ వైరం ఉంది. ఇప్పుడు మీ ఆటగాళ్ల మధ్య కూడా ఆ ప్రభావం కనిపిస్తుందా?
బోర్గ్, మెకన్రో ఇద్దరూ టెన్నిస్‌ ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్లు. అలాంటి వారి మధ్య గడపడం గౌరవంగా భావిస్తున్నాం. నావరకైతే బోర్గ్‌తో కలిసి అద్భుత సమయాన్ని గడిపాను. ఇప్పుడు కెప్టెన్లుగా కూడా తమ జట్టే విజయం సాధించాలని వారు కోరుకుంటారు.  
ప్రస్తుతం యువ ఆటగాళ్లలో అత్యంత నైపుణ్యం కలిగిన వారికి కొదవలేదు. అందులో కొందరు లేవర్‌ కప్‌లో కూడా ఆడనున్నారు. వీరిలో

ఎవరైనా భవిష్యత్‌లో మీ రికార్డులను అధిగమించేవారున్నారా?
మా జట్టులో ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యే అర్హత ఉన్న అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఉన్నాడు. ప్రతీ టోర్నీలో అతడి ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. అత్యంత నిలకడగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. కచ్చితంగా అతడికి మంచి భవిష్యత్‌ ఉండబోతోంది. గాయాల విషయంలో జాగ్రత్త వహిస్తే వచ్చే దశాబ్దం అతడిదే అనిపిస్తోంది.

టెన్నిస్‌లో ఇప్పటికే చాలా సాధించారు. ఇక తదుపరి లక్ష్యం ఏమిటి?
ఈ ఏడాది లేవర్‌ కప్‌ తర్వాత షాంఘై, బాసెల్, పారిస్, ఏటీపీ ఫైనల్స్‌ ఉన్నాయి. ఈ షెడ్యూల్‌పైనే ప్రస్తుతం నా దృష్టంతా ఉంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం, ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటాను.  

కెరీర్‌ ముగిశాక మీ జీవితాన్ని ఎలా ఊహించుకుంటున్నారు?
టెన్నిస్‌కు వీడ్కోలు పలికాక కూడా నా జీవితం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఆటకన్నా జీవితమే ముఖ్యం. మంచి తండ్రిగా, భర్తగా పేరు తెచ్చుకోవాలని ఉంది.

మరిన్ని వార్తలు