‘దశ ధీరుడు’ ఫెడరర్‌

28 Oct, 2019 14:31 IST|Sakshi

బాసెల్‌: స్విస్‌ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్‌ టెన్నిస్‌ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ మరో రికార్డు సాధించాడు. స్వదేశంలో జరిగిన బాసెల్‌ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్‌ 6-2, 6-2 తేడాతో అలెక్స్‌ డి మినావుర్‌(ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది ఫెడరర్‌కు 10వ బాసెల్‌ ఏటీపీ టైటిల్‌. ఫలితంగా ఈ టోర్నీలో రికార్డు టైటిల్స్‌ ఘనతతో ఫెడరర్‌ నయా రికార్డు నమోదు చేశాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన ఫెడరర్‌.. రెండో సెట్‌లో కూడా అదే ఊపును కనబరిచి మ్యాచ్‌తో పాటు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది ఓవరాల్‌గా ఫెడరర్‌కు 103 సింగిల్స్‌ టైటిల్‌ కావడం మరో విశేషం. అయితే ఒక టోర్నమెంట్‌ను 10సార్లు సాధించడం ఫెడరర్‌ కెరీర్‌లో రెండోసారి.

బాసెల్‌ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో ఫెడరర్‌ దూకుడు ముందు మినావుర్‌ తేలిపోయాడు. కేవలం 68 నిమిషాలు జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. వరుస రెండు సెట్లలోనే ఫెడరర్‌ తన విజయాన్ని ఖాయం చేసుకుని తనలో జోరు తగ్గలేదని నిరూపించాడు.  ఈ ప్రదర్శనపై ఫెడరర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొక గొప్ప మ్యాచ్‌ అని పేర్కొన్న ఫెడరర్‌.. చాలా తొందరగా ముగిసిందని పేర్కొన్నాడు. నా సొంత గడ్డపై 10వసారి ఈ టైటిల్‌ను సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్‌ మాత్రం చాలా కఠినంగా సాగిందన్నాడు. ఐదు సెట్లకు దారి తీసిన ఆ మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు వచ్చాయన్నాడు.

మరిన్ని వార్తలు