ఫెడరరే నా అసలైన ప్రత్యర్థి

19 Sep, 2017 00:22 IST|Sakshi
ఫెడరరే నా అసలైన ప్రత్యర్థి

రాఫెల్‌ నాదల్‌ ఇంటర్వ్యూ

గాయాలతో పడుతూ లేస్తూ సాగుతున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ కెరీర్‌లో ఈ ఏడాది అద్భుతమనే చెప్పవచ్చు. జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా... ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచి మరోసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇదే జోష్‌తో ఈనెల 22 నుంచి 24 వరకు చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌ పట్టణంలో టీమ్‌ యూరోప్, టీమ్‌ వరల్డ్‌ జట్ల మధ్య ‘లేవర్‌ కప్‌’ కోసం జరిగే టోర్నీ లో నాదల్‌ ‘టీమ్‌ యూరోప్‌’ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీలో సింగిల్స్‌తో పాటు తన చిరకాల ప్రత్యర్థి ఫెడరర్‌తో కలిసి తొలిసారిగా నాదల్‌ డబుల్స్‌ మ్యాచ్‌ ఆడే యోచనలో ఉన్నాడు.    
 
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడబోతున్నందుకు ఎలా అనిపిస్తోంది?
దిగ్గజ ఆటగాళ్లంతా కలిసి ఆడనుండటంతో ఈ టోర్నీ ప్రాముఖ్యత పెరిగింది. ఫెడరర్‌లాంటి ఆటగాళ్లు కూడా ఇందులో ఉండటంతో నాకైతే చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది.  

భవిష్యత్‌లో వేగంగా ముగిసే టోర్నీలదే హవా ఉంటుందని భావిస్తున్నారా?
అలా ఏమీ జరగదు. ప్రపంచ టెన్నిస్‌లో ఇదీ ఓ భాగమే తప్ప మేజర్‌ టోర్నీలను ఇది భర్తీ చేయలేదు. టెన్నిస్‌లో మార్పులను నేనేమీ కోరుకోవడం లేదు. సుదీర్ఘంగా సాగే మ్యాచ్‌ల్లో నాటకీయత, భావోద్వేగాలు, శారీరక పటిష్టత అన్నీ కలిసి ఉండి అభిమానులను ఆకర్షిస్తాయి.  

మీ చిరకాల ప్రత్యర్థి రోజర్‌ ఫెడరర్‌తో కలిసి ఒకే జట్టులో ఆడబోతుండడాన్ని ఎలా చూస్తున్నారు?  
ఒకే జట్టులో ఫెడెక్స్‌తో కలిసి ఆడడం నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ టోర్నీలో డబుల్స్‌లో కూడా అతనితో కలిసి ఆడే చాన్స్‌ ఉంది. తనలో ఉన్న లక్షణాలు ఇతర ఆటగాళ్లలో చూడలేదు. సర్వీస్, ఫోర్‌హ్యాండ్, వ్యాలీ ఇలా అన్నీ భారీగానే ఉంటాయి. అతడు నాకు చాలా కఠినమైన ప్రత్యర్థి. మా వైరం గురించి కోర్టులోనే కాకుండా బయట కూడా మాట్లాడుకోవడం ఈ క్రీడకు మంచిదే.

చాలా కాలం నుంచి మీరు అగ్రశ్రేణి క్రీడాకారుడిగా కొనసాగుతున్నారు. దీని రహస్యం ఏమిటి?
నా శక్తి సామర్థ్యాలపై ఉన్న నమ్మకమే కావచ్చు. ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆ తర్వాతే ప్రాక్టీస్‌ అని నమ్ముతాను. ఈ ఏడాది ఆఫ్‌ సీజన్‌లో నేను చేసే పని ముందుగా ఆరోగ్యంగా ఉండటమే.    

క్లే కోర్టులో మీ సీజన్‌ అత్యంత విజయవంతంగా గడిచింది. దీన్ని మీరు ఆస్వాదిస్తున్నారా?
కచ్చితంగా. క్లే కోర్టు టోర్నీలను గెలవడంలో నాకు మంచి రికార్డు ఉంది. ఫ్రెంచ్‌ ఓపెన్, మాంటెకార్లో, బార్సిలోనా, రోమ్‌ ఇలా అన్నింటిలో విజయాలు సాధించాను. అలాగే ఇతర కోర్టులపై కూడా మెరుగ్గా ఆడటాన్ని సవాల్‌గా తీసుకుంటాను. ఇటీవలే హార్డ్‌ కోర్టులో యూఎస్‌ ఓపెన్‌ గెలిచాను.

మీ కెరీర్‌లో గట్టి ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
ఫెడరర్‌. అతడి నుంచి ఎదురయ్యే పోటీని ఆస్వాదిస్తాను. ఇద్దరం సమకాలీకులవడం గర్వంగానూ ఉంది. జొకోవిచ్, ముర్రే కూడా గట్టి ప్రత్యర్థులే.  
 
భారత్‌లో మరోసారి మీ ఆటను అభిమానులు చూసే అవకాశం ఉందా?
నిజంగా నాకు తెలీదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఎడ్యుకేషనల్‌ సెంటర్‌ ద్వారా టెన్నిస్‌లో శిక్షణతో పాటు విద్యలో కూడా మా ఫౌండేషన్‌ సేవలందిస్తోంది.

కెరీర్‌ ముగిశాక మీ జీవితాన్ని ఎలా ఊహించుకుంటున్నారు?  
నేను కుటుంబాన్ని అమితంగా ఇష్టపడేవాడిని. పిల్లలంటే చాలా ఇష్టం. కెరీర్‌ ముగిశాక వారితోనే నా జీవితం అనుకుంటున్నాను. 

>
మరిన్ని వార్తలు